హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రసంగిస్తుండగా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అడ్డుకోవడంతో కొంత గందరగోళం నెలకొంది. ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలోని బంజారాహిల్స్‌లోని బంజారా భవన్‌లో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, గత కేసీఆర్ ప్రభుత్వం తొమ్మిదిన్నరేళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. దీనిపై దాసోజు శ్రవణ్, బీఆర్ఎస్ కార్పొరేటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి ప్రసంగాన్ని అడ్డుకున్నారు.
కేసీఆర్ పాలనలో 6 లక్షల రేషన్ కార్డులు జారీ చేశామని దాసోజు శ్రవణ్ తెలిపారు. సమస్యలు వివరిస్తామని బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్రయత్నించగా, మంత్రి పొన్నం, ఎమ్మెల్యే దానం నాగేందర్ వారిని వారించారు. కార్పొరేటర్లు తమాషా చేస్తున్నారా అంటూ దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో అక్కడ గందరగోళ పరిస్థితి ఏర్పడింది.