ప్రభుత్వంలోని ఓ విభాగంలో కిందిస్థాయి ఉద్యోగిగా పదవీవిరమణ చేశాడాయన! ఉద్యోగిగా ఆయన అందుకున్న చివరి జీతం కేవలం రూ.15 వేలు మాత్రమే. అయితే, ఆయన పోగేసిన ఆస్తులు చూస్తే కళ్లు తిరగాల్సిందే. పదుల సంఖ్యలో ఇళ్లు, ఎకరాల కొద్దీ భూములు, కిలోల కొద్దీ వెండి, బంగారు ఆభరణాలు.. ఇలా భారీగా అక్రమాస్తులు పోగేశాడు. కర్ణాటకలోని కొప్పల్ జిల్లాకు చెందిన కలకప్ప నిడగుండి అనే మాజీ గుమస్తా ఆస్తులు ఇవి! మొత్తం ఆస్తుల విలువ దాదాపు రూ.30 కోట్ల పైనే అని అధికారులు తేల్చారు. కలకప్ప కొప్పల్ జిల్లాలోని ఉన్న గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి లిమిటెడ్ లో గుమాస్తాగా పనిచేసి రిటైరయ్యాడు. తాజాగా కలకప్ప ఇంట్లో సోదాలు చేసిన లోకాయుక్త అధికారులు ఆయన ఆస్తులు చూసి అవాక్కయ్యారు.
గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి లిమిటెడ్ లో గుమస్తాగా కలకప్ప అందుకున్న జీతం నెలకు రూ.15 వేలు మాత్రమే. అయితే, ఇంజినీర్‌గా పనిచేసిన జెడ్ఎం చిన్చోల్కర్‌తో కలిసి కలకప్ప అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. పలు ప్రాజెక్టులకు నకిలీ పత్రాలు, నకిలీ బిల్లులు సృష్టించి దాదాపు రూ.72 కోట్లకు పైగా నిధులను దుర్వినియోగం చేశారని సమాచారం. ఈ అక్రమాలకు సంబంధించి ఫిర్యాదు అందడంతో లోకాయుక్త అధికారులు స్పందించారు.
కలకప్ప ఇంట్లో సోదాలు నిర్వహించి భారీగా అక్రమాస్తులను గుర్తించారు. కలకప్పకు 24 ఇళ్లు, 40 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు ఆయన భార్య, సోదరుడి పేర్ల మీద కూడా పలు ఆస్తులు ఉన్నాయని వెల్లడైంది. ఇంట్లో 350 గ్రాముల బంగారం, 1.5 కిలోల వెండి ఆభరణాలతో పాటు రెండు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు