ఓ మహిళకు సంతానం విషయంలో బట్టబయలైన ఆసుపత్రి భాగోతం
సికింద్రాబాద్ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ డాక్టర్ నమ్రత అరెస్ట్
2021లోనే ఆసుపత్రి రిజిస్ట్రేషన్ ముగిసిందన్న డీసీపీ
అయినప్పటికీ అక్రమంగా నిర్వహిస్తున్నారని వెల్లడి
సికింద్రాబాదులోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లో సంతానం కలగని దంపతులను మోసం చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఈ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత సరోగసీ పేరుతో దంపతులను బురిడీ కొట్టించినట్లు డీసీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. ఈ ఆసుపత్రికి సరైన అనుమతులు లేకుండానే అక్రమంగా నిర్వహిస్తున్నట్లు ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె వెల్లడించారు. 2021లోనే ఆసుపత్రి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల గడువు ముగిసినట్లు ఆమె తెలిపారు. అయితే, ఆసుపత్రిని మూసివేస్తున్నట్లు కోర్టుకు చెప్పి, అక్రమంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ వ్యవహారంపై కూడా నమోదై, విచారణ జరుగుతోందని డీసీపీ పేర్కొన్నారు.
కొంతకాలం కిందట, సంతానం కలగని దంపతులు సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్‌ను సంప్రదించగా, డాక్టర్ నమ్రత వారికి పలు పరీక్షలు నిర్వహించి ఐవీఎఫ్ సాధ్యం కాదని, సరోగసీ ద్వారా సంతానం పొందవచ్చని సూచించారు. దీనికి రూ.30 లక్షల ఖర్చు అవుతుందని, విశాఖకు చెందిన ఓ మహిళ సరోగసీకి అంగీకరించిందని చెప్పారు. దంపతుల నుంచి అండం, వీర్యం సేకరించి సరోగసీ చేస్తున్నట్లు నమ్మించారు. అయితే, విశాఖలోని ఓ గర్భిణిని సరోగసీ మదర్‌గా చూపించారు. కొన్నాళ్ల తర్వాత ఆ ఆసుపత్రిలో ఓ శిశువును దంపతులకు అప్పగించారు.
అనుమానం వచ్చిన దంపతులు డీఎన్‌ఏ పరీక్ష చేయించగా, ఆ శిశువు తమకు చెందినది కాదని తేలింది. నమ్రత అసలు సరోగసీ చేయకుండా, అస్సాంకు చెందిన ఓ మహిళ నుంచి రూ.90 వేలకు శిశువును కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. ఈ విషయంలో డాక్టర్ నమ్రతతో పాటు సెంటర్ సిబ్బంది కూడా సరైన నిపుణులు కాదని, నిబంధనలను ఉల్లంఘించారు. ఈ మోసంలో నమ్రత కుమారుడు జయంత్ కృష్ణ కూడా బాధితులను బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి” అని డీసీపీ వివరించారు.
ఈ ఘటనను డీసీపీ రష్మీ పెరుమాళ్ చైల్డ్ ట్రాఫికింగ్‌గా అభివర్ణించారు. ఈ కేసులో డాక్టర్ నమత్ర సహా 8 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు ఆమె వెల్లడించారు.