ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు, తెలంగాణలో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక భూముల ధరలు రివర్స్ అయ్యాయని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఒకప్పుడు తెలంగాణలో ఎకరం భూమి అమ్మితే ఏపీలో పది ఎకరాలు వచ్చేదని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ఏపీలో ఎకరం భూమి అమ్మితే తెలంగాణలో రెండు ఎకరాలు వస్తోందని అన్నారు. రేవంత్ రెడ్డికి పాలన చేతకాక తెలంగాణలో ఇలాంటి పరిస్థితి వచ్చిందని విమర్శించారు.
ప్రజ్ఞాపూర్‌లో నిర్వహించిన గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడుతూ, మరో రెండేళ్లు కాంగ్రెస్ పాలన కొనసాగితే భూముల రేట్లు సగానికి పడిపోతాయని అన్నారు. కేసీఆర్ మళ్లీ రావాలని ప్రజలంతా కోరుకుంటున్నారని హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ చేసిన రుణమాఫీ 30 పైసలు, ఎగ్గొట్టింది 70 పైసలు అని విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు.
ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం రాష్ట్రంలోని 31 జిల్లా పరిషత్‌లలో 16-18 బీఆర్ఎస్ సొంతం చేసుకోబోతుందని తేలిందని అన్నారు. సిద్దిపేటలోని మెజార్టీ మండలాల్లో బీఆర్ఎస్ను గెలిపించాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ హయాంలో తెలంగాణ ఎలా ఉండేది, కాంగ్రెస్ హయాంలో ఎలా అయిందో ప్రజలకు అర్థమైందని అన్నారు. 12 వేల ఉద్యోగాలు ఇచ్చి 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు.
కేసీఆర్ పదేళ్ల కాలంలో లక్షా 68 వేల ఉద్యోగాలు ఇచ్చారని ఆయన వెల్లడించారు. నాడు అశోక్ నగర్ వెళ్లిన రాహుల్ గాంధీ ఇప్పుడు పత్తా లేడని విమర్శించారు. రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పడానికి అశోక్ నగర్లో విద్యార్థులు, నిరుద్యోగులు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులకు ఇబ్బందులు మొదలయ్యాయని అన్నారు.