భారత వ్యోమగామి, గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా 18 రోజులపాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడిపి సురక్షితంగా భూమికి తిరిగి వచ్చారు. శుభాంశు శుక్లా తిరిగిరావడంతో యావత్ భారతావని గర్విస్తోంది. ఆయన భూమిపై అడుగుపెట్టిన క్షణాన తల్లిదండ్రుల కళ్లు ఆనందంతో తడిసి ముద్దయ్యాయి.
శుభాంశు శుక్లా బుధవారం నాడు అమెరికాలో తన కుటుంబాన్ని కలుసుకున్నారు. తన భార్యను కలుసుకున్న శుభాంశు ఆమెను ఆప్యాయంగా హత్తుకున్నారు. అనంతరం తన బిడ్డను రెండు చేతులతో ఎత్తుకొని పుత్రోత్సాహంతో ఉద్వేగానికి లోనయ్యారు. శుభాంశు శుక్లా తన కుటుంబాన్ని కలుసుకున్న సందర్భంలోని ఆనంద క్షణాలను ఇక్కడ ఫొటోల రూపంలో చూడవచ్చు.
శుభాంశు భార్య పేరు డాక్టర్ కామ్నా శుక్లా. ఆమె వృత్తిరీత్యా దంత వైద్యురాలు. శుభాంశు, కామ్నా పాఠశాల రోజుల నుంచి స్నేహితులు. ఆ సమయంలోనే వారి మధ్య ప్రేమ చిగురించింది. ఇరువురి కుటుంబ సభ్యుల అంగీకారంతో వారు వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
అంతరిక్షం నుంచి తిరిగొచ్చిన శుభాంశు శుక్లా… భార రహిత స్థితి నుంచి సాధారణ స్థితికి వచ్చేందుకు వీలుగా హూస్టన్ లో వారం రోజుల పాటు క్వారంటైన్ లో ఉండనున్నారు. ఆయన భార్యాబిడ్డలు కూడా ప్రస్తుతం హూస్టన్ లోనే ఉన్నారు.