హన్మకొండ జిల్లాలో పోస్టాఫీసు వద్ద మహిళలు క్యూ కడుతున్నారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రూ. 2,500 పోస్టాఫీసు ఖాతాలో జమ చేస్తారంటూ జరిగిన ప్రచారం ఇందుకు కారణమైంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు మహాలక్ష్మి పథకం ద్వారా అర్హులైన మహిళలకు నెలకు రూ. 2,500 అందిస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా, పోస్టాఫీసులో ఖాతా ఉంటే రూ. 2,500 జమ చేస్తారని ప్రచారం జరగడంతో గత వారం రోజులుగా మహిళలు, వృద్ధులు, బాలింతలు పోస్టాఫీసులో ఖాతా తెరవడం కోసం బారులు తీరుతున్నారు.
ఈ విషయంపై పోస్టాఫీసు అధికారులు స్పందిస్తూ, ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి అధికారిక సమాచారం అందలేదని తెలిపారు. పోస్టాఫీసు ఖాతా తెరవడం లాభదాయకమని, ఖాతా తెరవాలనుకునే వారికి అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. మహాలక్ష్మి పథకం గురించి ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక సమాచారం లేదని వారు స్పష్టం చేశారు.
