కడుపున పుట్టిన పిల్లలను మీరు విచ్చలవిడిగా వదిలేస్తున్నారు.. కానీ, మిమ్మల్ని అందరినీ నేను కడుపులో పెట్టుకుని కాచుకుంటున్నా’ అంటూ మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి బోనాల ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం రంగం, భవిష్యవాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. పచ్చికుండపై నిలబడి మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. రాబోయే రోజుల్లో వర్షాలు సమృద్ధిగా కురిపిస్తానని, పాడిపంటలతో సిరులు కురిపించే బాధ్యత తనదేనని మాతంగి నోట అమ్మవారు పలికారు. అయితే, రాబోయే రోజుల్లో మహమ్మారి వెంటాడుతుందని, అగ్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయని హెచ్చరించారు. కాలం తీరితే ఎవరు ఏది అనుభవించాలో వారు అది అనుభవిస్తారు, తాను అడ్డురానని స్పష్టం చేశారు. ‘ఈసారి చాలా సంతోషంగా పూజలు చేశారు. ఏడాదికి ఒక్కసారి కాకుండా నిత్యం కొలిచే వారికే నా ఆశీస్సులు ఉంటాయి’ అని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు.
ఉజ్జయినీ మహంకాళి బోనాల ఉత్సవంతో సంతృప్తి చెందావా.. అని అర్చకులు ఆమెను ప్రశ్నించారు. అందుకు మాతంగి స్వర్ణలత సమాధానం చెబుతూ.. ప్రజలంతా డప్పుచప్పుళ్లతో ఆనందోత్సాహాల నడుమ తనకు బోనాలు సమర్పించారని తెలిపారు. వచ్చిన ప్రతి బోనాన్ని తాను సంతోషంగా అందుకున్నానని పలికారు. కానీ, ఏటా ఉత్సవానికి ఏదో ఒక ఆటంకం కల్పిస్తున్నారని.. తనను ఎవరూ లెక్కచేయడం లేదని అమ్మవారు చెప్పారు. రాసుల కొద్దీ సంపదను తాను రప్పించుకుంటున్నా.. గోరంతైనా తనకు దక్కడంలేదని, సక్రమంగా పూజలు జరిపించాలి బాలకా అంటూ అమ్మవారు ఆగ్రహించారు. తాను కన్నెర్ర జేస్తే… రక్తం కక్కుకుని చస్తారంటూ హెచ్చరించారు. అమ్మవారి ప్రశ్నలకు ఆలయ ప్రధానార్చకుడు సమాధానమిస్తూ.. ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా తాము దగ్గరుండి పూజలు చేయిస్తున్నామని తెలిపారు. ఇక నుంచి ఎలాంటి లోటుపాట్లు, పొరపాట్లు జరగనివ్వబోమని అమ్మవారిని వేడుకున్నారు. దీంతో అమ్మవారు పూనిన మాతంగి స్వర్ణలత శాంతించారు.