గిరిజనుల జ్ఞాన జ్యోతి జంగు భాయ్

Kamareddy
3 Min Read

గిరిజనుల జ్ఞాన జ్యోతి జంగు భాయ్

* జులై 13 జంగుబాయి సంస్మరణ దినోత్సవం

* గుమ్మడి లక్ష్మీనారాయణ,
సామాజిక రచయిత,

కామారెడ్డి ప్రతినిధి జులై 12 (ప్రజా జ్యోతి)

ప్రత్యేక సంస్కృతీ సంప్రదాయాలు పాటిస్తున్న ఆదిమ గిరిజనులలో ఆరాధ్య సేవలందించేవారు అరుదుగా కనిపిస్తుంటారు. ఆ కోవలో ఆది ఆరాధ్య దైవంగా, భక్తి సేవలో, సామాజికంగానూ సేవలందించి ఆదివాసీల గుండెల్లో చెరగని ముద్రగా నిలిచిన పంత్ శ్రీ మెస్రం జంగుబాయి 2018, జూలై 13న శివైక్యం చెందారు. గిరిజనుల్లో (గోండు తెగ) జంగుబాయి తొలి ఆధ్యాత్మిక సంఘ సేవకురాలు. కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు) మండలం ధనోరా ఏజెన్సీ గూడెంలో జన్మించిన జంగుబాయి అక్షర జ్ఞానం లేకపోయినా ఆధ్యాత్మిక మార్గంలో, అనేక సామాజిక సేవాకార్యక్రమాల్లో తనదైన శైలిలో సేవలు అందించడం అభినందనీయం.
భూర్నూర్ గ్రామానికి చెందిన తొడసం సుంగు- సోంబాయి దంపతుల కూతురైన జంగుబాయి- ధన్నోరకు చెందిన మెస్రం రాజుపటేల్ కు రెండో భార్య. 1940లో జంగుబాయి రాజు దంపతులు సంత్ శ్రీ సురోజ్ మహరాజ్ బోధనలకు ఆకర్షితులై బాబాకు శిష్యులుగా మారారు. 1960 లో ఆమె భర్త రాజు పటేల్ అనారోగ్యంతో మరణించారు. జంగుబాయి తన గురువు సురోజ్ తో కలిసి భక్తి సేవలలో, అనేక సామాజిక కార్యక్రమాలలో పాలుపంచుకున్నారు. అందరూ భక్తి మార్గంలో పయనిస్తే సమాజంలో ఎలాంటి భేదభావాలు ఉండవని తలచారు. ముఖ్యంగా ఆదివాసీ యువత వ్యసనాలకు బానిసలు కావద్దంటూ ప్రచారం చేశారు.
మెహగాం గ్రామంలోని గుట్టపై తన గురువు సురోజ్ మహరాజ్ తపస్సు చేసిన ప్రదేశంలో జంగుబాయి 1962లో శివాలయం నిర్మించారు. ఏటా శివరాత్రి రోజు జాగారం, ఇత్యాది పూజా కార్యక్రమాలు నిర్వహించేవారు. 1970లో మెహగాం గుట్ట కింద కూడా మరొక సముదాయక్ ప్రార్ధనా మందిరం నిర్మించారు. ప్రతి ఏటా శివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రధానంగా ఉచిత సామూహిక వివాహాలు జరపటం ఆచారంగా పెట్టుకున్నారు. సుమారుగా 1600 లకు పైగా పేద జంటలకు ఉచిత వివాహాలు చేశారు. జంగుబాయికి పరిసర జిల్లాల నుండి కూడా వేలాది మంది భక్తులు వచ్చేవారు. ఇలా భక్తి మార్గంలో నడుస్తూ, మెహగాం గ్రామాన్ని పూర్తిగా మార్చేసిన సేవా మూర్తి జంగుబాయి.ఆదివాసీ మహిళలు చదువులో ఎదగాలనే లక్ష్యంతో 1980 లో తన సొంత ఖర్చులతో మెహగాంలో బాలికల ఆశ్రమ పాఠశాలను స్థాపించారు. మొదటగా 40. మంది విద్యార్థినులకు ఉచిత విద్యతోపాటు వసతి సౌకర్యం కల్పించారు. చదువుపై ఆమెకున్న ఆసక్తిని గ్రహించిన గ్రామస్తులు వారి పిల్లలందరికీ క్రమం తప్పకుండా బడికి పంపించేవారు. ఇలా నాలుగు సంవత్సరాలుగా పాఠశాలను నడిపించారు. 1956లో ఉట్నూరు ఐ టి డి ఎ ప్రాజెక్టు అధికారి పి. సుబ్రమణ్యం ఆ ఆశ్రమ పాఠశాలను పరిశీలించి ‘ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల’గా మార్చి ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనసాగిస్తున్నారు. ఆమె సేవలను గుర్తించిన అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2010 లో “గిరి జ్యోతి”, “ఉత్తమ సామాజిక సేవకురాలు” అవార్డులతో సత్కరించింది. ఆదివాసీల్లో గూడు కట్టుకున్న అనాగరికతను, దురలవాట్లను రూపుమాపి భక్తి మార్గం వైపు నడిపించారు. ఎనిమిది దశాబ్దాలుగా సామాజిక సేవలందించిన తొలి ఆదివాసీ ఆధ్యాత్మిక మహిళ జంగుబాయి 98 ఏళ్ళ వయసులో శివైక్యం చెందినారు. ఎందరో నిరుపేద గిరిజన ఆదివాసీలకు పలు సామాజిక సేవలందించి గిరిజనుల గుండెల్లో స్పూర్తి నింపిన మహాత్మురాలు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *