ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణా నదిలో వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల, సుంకేసుల నుంచి భారీగా వరద నీరు శ్రీశైలం డ్యామ్‌కు చేరుతుండటంతో శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. ప్రాజెక్టు గరిష్ట మట్టానికి నీరు చేరడంతో నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా నాలుగు గేట్లు తెరిచి నీటిని దిగువకు విడుదల చేశారు.
శ్రీశైలం నుంచి లక్షకు పైగా క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తున్నారు. దీనితో నాగార్జునసాగర్ జలాశయానికి 1,05,764 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. ఔట్ ఫ్లో 9,334 క్యూసెక్కులుగా నమోదైంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 534.50 అడుగులుగా ఉంది. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 177 టీఎంసీలుగా నమోదైంది.