సైబర్ నేరగాళ్లు నిత్యం కొత్త మార్గాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ట్రాఫిక్ చలానా పేరుతో ఓ రిటైర్డ్ ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్‌ను బురిడీ కొట్టించి ఆయన ఖాతా నుంచి లక్షకు పైగా నగదును కాజేశారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.
నగరానికి చెందిన 49 ఏళ్ల రిటైర్డ్ ఆర్మీ అధికారికి ఈ నెల 6న వాట్సప్‌కు ఒక సందేశం వచ్చింది. ఆయన కారు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిందని, దీనికి గాను రూ.1000 జరిమానా చెల్లించాలని ఆ సందేశంలో పేర్కొన్నారు. చెల్లింపు కోసం ఒక ఏపీకే ఫైల్‌ను కూడా పంపించారు. అది నిజమేనని భావించిన ఆ మాజీ అధికారి ఆ ఫైల్‌ను తన ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకున్నారు.
ఆయన ఫైల్ ఇన్‌స్టాల్ చేసిన కొద్ది క్షణాల్లోనే అసలు మోసం బయటపడింది. ఆయనకు చెందిన ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు నుంచి రెండు వేర్వేరు లావాదేవీల్లో మొత్తం రూ.1,20,409 డెబిట్ అయినట్లు ఆయన ఫోన్‌కు సందేశాలు అందాయి. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.