హిమాచల్‌లో ఆగని వర్ష బీభత్సం.. 75 మంది మృతి.. రెడ్ అలర్ట్ జారీ

V. Sai Krishna Reddy
1 Min Read

హిమాచల్ ప్రదేశ్‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ప్రకృతి ప్రకోపానికి మండి జిల్లాలో మృతుల సంఖ్య 75కు చేరడం తీవ్ర విషాదాన్ని నింపింది. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న కుండపోత వానల కారణంగా కొండచరియలు విరిగిపడుతుండగా, మెరుపు వరదలతో జనజీవనం స్తంభించిపోయింది.

ఈ విపత్తు కారణంగా రాష్ట్రంలో 240కి పైగా రహదారులు పూర్తిగా మూతపడ్డాయి. వాటిలో అత్యధికంగా 176 రోడ్లు ఒక్క మండి జిల్లాలోనే ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. భారీ వర్షాలతో సహాయక చర్యలకు కూడా తీవ్ర ఆటంకం కలుగుతోందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఒక్క రోజులోనే 115 నుంచి 204 మిల్లీమీటర్ల అత్యంత భారీ వర్షపాతం నమోదైంది.

ఇదిలా ఉండగా, వాతావరణ శాఖ రానున్న 24 గంటలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. కంగ్రా, సిర్మూర్‌, మండి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. చంబా, కంగ్రా, శిమ్లా, సిర్మూర్ జిల్లాల్లో మెరుపు వరదలు సంభవించవచ్చని హెచ్చరించింది. మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసి, బలహీనమైన కట్టడాల్లో నివసించవద్దని ప్రజలను కోరింది.

ప్రస్తుతం ఐటీబీపీ దళాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. సహాయక చర్యలను మరింత వేగవంతం చేసేందుకు బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్‌వో) సహకారం కూడా తీసుకోవాలని మాజీ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ ప్రభుత్వానికి సూచించారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *