ఇప్పటికే అమెరికాలోని ట్రంప్ సర్కార్ విదేశీ విద్యార్థుల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. పలు కారణాలతో విదేశీ విద్యార్థుల వీసాలను రద్దు చేస్తూ… వారిని దేశం నుంచి వెళ్లగొడుతోంది. తాజాగా యూఎస్ విదేశీ విద్యార్థులకు మరో వార్నింగ్ ఇచ్చింది. తమ విద్యా సంస్థల్లో చదివే భారత్ సహా విదేశీ విద్యార్థుల గైర్హాజరు ఆధారంగా కూడా వీసాలను రద్దు చేస్తామని హెచ్చరించింది.
ఈ మేరకు భారత్లోని యూఎస్ రాయబార కార్యాలయం ఈ విషయమై ఓ ప్రకటన విడుదల చేసింది. “విద్యాసంస్థ నుంచి డ్రాపౌట్ అయినా.. క్లాస్లు ఎగ్గొట్టినా.. విద్యాసంస్థకు చెప్పకుండా స్టడీ ప్రోగామ్ నుంచి వెళ్లిపోయినా మీ స్టూడెంట్ వీసా రద్దు అవుతుంది. భవిష్యత్తులో మీరు ఎలాంటి అమెరికా వీసాలకైనా అర్హత కోల్పోతారు. సమస్యల బారినపడకుండా ఉండేందుకు నిబంధనలకు అనుగుణంగా నడుచుకోండి. మీ విద్యార్థి వీసాను కొనసాగించుకోండి” అని అమెరికా ఎంబసీ తన ప్రకటనలో పేర్కొంది.