ప్రపంచ ప్రఖ్యాత టైమ్స్ మ్యాగజైన్ ఏటా విడుదల చేసే అత్యంత ప్రభావశీలురైన 100 మంది ప్రముఖుల జాబితా విడుదలైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ వంటి ప్రపంచ దిగ్గజాలకు ఈ ఏడాది (2025) జాబితాలో స్థానం దక్కింది. గతేడాది బాలీవుడ్ నటి అలియా భట్, రెజ్లర్ సాక్షి మాలిక్ వంటి భారతీయులకు చోటు దక్కగా, ఈసారి భారతదేశం నుంచి ఒక్క ప్రముఖుడికి కూడా స్థానం లభించకపోవడం గమనార్హం.
భారత సంతతికి చెందిన ప్రముఖ మహిళ రేష్మా కేవల్ రమణి ఈ జాబితాలోని ‘లీడర్స్’ కేటగిరీలో స్థానం దక్కించుకున్నారు. వెర్టెక్స్ ఫార్మాస్యూటికల్స్ సంస్థకు ఆమె సీఈవోగా వ్యవహరిస్తున్నారు. రమణికి 11 ఏళ్ల వయసులో ఆమె కుటుంబం అమెరికాకు వలస వెళ్లింది. అక్కడే విద్యాభ్యాసం పూర్తిచేసిన రమణి.. అమెరికాలోనే ఓ పెద్ద బయోటెక్నాలజీ కంపెనీకి తొలి మహిళా సీఈవోగా ఎదిగారు.
సికిల్ సెల్ వ్యాధి చికిత్స కోసం రోగుల డీఎన్ఏను సరిచేసే క్రిస్పర్ ఆధారిత థెరపీకి తొలిసారిగా అమెరికా ఎఫ్‌డీఏ ఆమోదం లభించడంలో రమణి నాయకత్వ పాత్రను టైమ్స్ మ్యాగజైన్ ప్రముఖంగా ప్రస్తావించింది. డీఎన్ఏ ఆధారిత చికిత్సలతో భవిష్యత్తులో మరిన్ని రోగాలకు విరుగుడు కనుగొనడంలో రేష్మా లాంటి నాయకులు కీలకమని రచయిత జాసన్ కెల్లీ అభిప్రాయపడ్డారు.
ఈ జాబితాలోని ‘లీడర్స్’ కేటగిరీలో రేష్మాతో పాటు యూకే ప్రధాని కీర్ స్టార్మర్, నోబెల్ గ్రహీత, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ యూనస్, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వంటి ఇతర ప్రముఖులు కూడా ఉన్నారు.