భారత్ కు మేలు చేయనున్న చైనాపై ప్రతీకార మోత!

V. Sai Krishna Reddy
2 Min Read

చైనాపై అగ్రరాజ్యం విధించిన ప్రతీకార సుంకం మనకు మేలు కలిగేలా చేస్తుందా? మన ఆర్థిక ప్రయోజనాలు మాత్రమే కాదు.. ఆర్థికంగా మరింత బలోపేతం అయ్యేందుకు సాయం చేస్తుందా? అంటే.. అవునన్న మాట వినిపిస్తోంది. దీనికి కారణాలు లేకపోలేదు. చైనాపై భారీగా ప్రతీకార సుంకాన్ని విధించటం ద్వారా.. చైనా నుంచి ఎగుమతి అయ్యే వస్తువులు.. వస్తు సేవల ధరలు భారీగా పెరగనున్నాయి.

అదే సమయంలో ఆ తరహా ఉత్పత్తులు భారత్ నుంచి ఎగుమతి అయితే తక్కువ ధరకు అమెరికాకు చేరటమే కాదు.. దీని కారణంగా మన ఎగుమతుల విలువ పెరిగి.. మేలు చేస్తుంది. ఉదాహరణకు ఐఫోన్ల విషయానికే వస్తే.. తాజా ప్రతీకార సుంకాల మోత నేపథ్యంలో చైనా నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే ఐఫోన్ తో పోలిస్తే.. భారత్ నుంచి ఎగుమతి అయ్యే ఐఫోన్ 20 శాతం తక్కువ ధరకు రానుంది.
ఇదంతా ఒక్క స్మార్ట్ ఫోన్ విషయంలోనే కాదు ట్యాబెట్లు.. ల్యాప్ టాప్ లతో పాటు మరిన్ని ఎలక్ట్రానిక్ పరికరాలపై సుంకం మినహాయింపు మన ఎగుమతులు పెంచేందుకు సాయం చేస్తాయి. మన దేశం మాదిరే వియత్నాం మీద కూడా జీరో సుంకం ఉంది. కాకుంటే.. వియత్నాం నుంచి శాంసంగ్ ఫోన్లు ఉత్పత్తి అయి అమెరికాకు ఎగుమతి అవుతాయి. ఐఫోన్ల విషయానికి వస్తే.. మన దేశంలోనూ ప్లాంట్ ఉందన్న సంగతి తెలిసిందే. 2024-25లో మన దేశం నుంచి రూ.2లక్షల కోట్ల స్మార్ట్ ఫోన్లు ఎగుమతి అయ్యాయి. ఇందులో రూ.1.50 లక్షల కోట్ల విలువైన ఐఫోన్లు ఉన్నాయి. దేశీయంగా చూస్తే.. గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.1.89 లక్షల కోట్ల విలువైన ఐఫోన్లు ఉత్పత్తి అయ్యాయి. అంతర్జాతీయంగా తయారయ్యే ప్రతి ఐదు ఐఫోన్లలో ఒకటి భారత్ లోనే ఉత్పత్తి కావటం గమనార్హం. ఈ లెక్కన చైనా మీద విధించిన ప్రతీకార సుంకం భారత్ కు మేలు కలిగేలా చేస్తుందని చెప్పాలి.

అంతకాదు.. చైనా మీద విధించిన సుంకం షాక్ పుణ్యమా అని దేశీయ ఆన్ లైన్ ఎగుమతిదారులకు భారీగా అవకాశాలు లభిస్తాయని చెబుతున్నారు. అదెలానంటే.. ప్రస్తుతం మన దేశం నుంచి లక్ష మందికి పైగా ఇ- కామర్స్ విక్రేతలు.. 5 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు చేస్తున్నారు. ఈ ఉత్పత్తులు చైనా నుంచి కూడా ఎగుమతి అవుతుంటాయి. తాజా పరిణామాల నేపథ్యంలో భారత్ కు చెందిన ఆన్ లైన్ ఎగుమతిదారులు లాభం చెందే వీలుందని చెబుతున్నారు. సుమారు రూ.69 వేల కంటే తక్కువ విలువైన చైనా.. హాంకాంగ్.. ఇకామర్స్ ఉత్పత్తులపై మే రెండు నుంచి 120 శాతం దిగుమతి సుంకాన్ని అమెరికా విధిస్తుంది. ఈ నిర్ణయంతో చైనా సరఫరా వ్యవస్థ దారుణంగా ప్రభావితం అవుతుందని చెబుతున్నారు. అదే సమయంలో ఇతర దేశాలకు మేలు కలిగేలా చేస్తుందని చెబుతున్నారు. 2024లో ప్రపంచ దేశాల నుంచి తక్కువ విలువైన ఉత్పత్తులున్న పాకెట్లు దాదాపు 140 కోట్లకు పైనే అమెరికాకు వచ్చాయి. అందులో చైనా వాటా లేకపోలేదు. ఇందులో చైనా నుంచి వెళ్లిన పార్శిల్ విలువ ఏకంగా 46 బిలియన్ డాలర్లు. తాజాగా భారీగా సుంకాల వడ్డన నేపథ్యంలో భారత్ కు అవకాశాల్ని సొంతం చేసుకునే వీలుందని చెబుతున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *