ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ శ్రీలంక పర్యటన ముగించుకుని, తమిళనాడు వచ్చి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శ్రీలంక నుంచి ప్రత్యేక విమానంలో భారత్ చేరుకున్న ఆయన ఓ వీడియో పంచుకున్నారు. విమానంలో వస్తూ సముద్రంలోని రామసేతును చూశానని వెల్లడించారు.
కొద్దిసేపటి క్రితం శ్రీలంక నుంచి తిరిగి వస్తుండగా… రామసేతు దర్శనం చేసుకునే అదృష్టం కలిగిందని తెలిపారు. దైవికంగా, యాదృచ్ఛికంగా… అయోధ్యలో బాలరాముడికి సూర్య తిలకం జరుగుతున్న సమయంలోనే ఇది చోటుచేసుకుందని వివరించారు. ఈ రెండింటి దర్శనం చేసుకునే అదృష్టం తనకు లభించిందని హర్షం వ్యక్తం చేశారు. శ్రీరాముడు మనందరినీ ఐక్యం చేసే శక్తి… ఆయన ఆశీస్సులు ఎల్లప్పుడూ మనపై ఉండాలి అని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.