సాధారణంగా శివరాత్రి తర్వాత చలిపోయి, వేడి పెరుగుతుంది అంటారు. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో అలా జరగలేదు. శివరాత్రి తర్వాత కొద్దిగా చలి పెరిగింది. మరోవైపు భానుడు కూడా భగభగలు సృష్టిస్తున్నాడు. దీంతో వింత వాతావరణం తట్టుకోలేక తల్లడిల్లుతున్నారు జనం. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని ఆరు మండలాలలో మార్చి నెలలో వాతావరణంలో వస్తున్న మార్పులు ప్రజలకు ఆందోళన కలిగిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా నియోజకవర్గంలోని ఆరు మండలాలు పర్చూరు, యద్దనపూడి, మార్టూరు , కారంచేడు , ఇంకోల్లు, చిన్నగంజాం మండల పరిసర ప్రాంతాల్లో విభిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతి రోజు సాయంత్రం ఆరు గంటలకు ఉక్కపోత మొదలవుతోంది. వేకువ జామున పొగమంచు కమ్మేస్తుంది. ఉదయం ఎనిమిది గంటల కల్లా ఎండ తీవ్రత మొదలవుతుంది. ఒక్కసారిగా వాతావరణంలో పలు మార్పులు చోటు చేసుకోవడం.. ఉదయం దుప్పటి మంచు, ఆ తరువాత భానుడు తన ప్రతాపం చూపించటంతో మద్యాహ్నం12 గంటలకు ఎండ తీవ్రత పెరిగి రహదారులు నిర్మానుషంగా మారుతున్నాయి. వ్యవసాయ పనులకు వెళ్లే కూలీలు ఉక్కపోతతో విలవిల్లాడిపోతున్నారు. వృద్దులు, చిన్నారులు ఇళ్లలో ఉండలేక బయటకు రాలేక అల్లాడిపోతున్నారు.
మార్చి నెలలోనే పరిస్థితి దారుణంగా ఉంటే ఏప్రిల్, మే నెలలో భానుడి భగభగలు మరింత పెరగవచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. చెట్లు నరికి వేయడం, మొక్కలు సంరక్షణ చేపట్టకపోవడం, ఖాళీ స్థలాలు లేకుండా రోడ్డు పక్కన కాంక్రీట్ వేయడం, వాతావరణ మార్పులకు ప్రధాన కారణం అని, దీనివలన ప్రజలు అనారోగ్యానికి గురికావాల్సి వస్తుందని వైద్యులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పచ్చదనం పరిరక్షించుకోకపోతే పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.