సిఫారసు లేఖలపై టీటీడి కీలక నిర్ణయం

V. Sai Krishna Reddy
1 Min Read

తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలతో తిరుమల శ్రీవారిని దర్శించుకునే అవకాశం కల్పిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 24వ తేదీ నుంచి ఈ విధానం అమల్లోకి రానున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ వెల్లడించింది.

ఈ కొత్త విధానం ప్రకారం, తెలంగాణ ప్రజాప్రతినిధులు సిఫార్సు చేసిన భక్తులు ఇకపై శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు. అయితే వీఐపీ బ్రేక్ దర్శనాలు సోమవారం , మంగళవారం మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ దర్శనాలకు సంబంధించిన సిఫార్సు లేఖలను బుధవారం, గురువారం రోజుల్లో మాత్రమే టీటీడీ స్వీకరించనుంది.

ఒక్కో తెలంగాణ ప్రజాప్రతినిధికి రోజుకు ఒక సిఫార్సు లేఖను మాత్రమే అనుమతిస్తారు. ఆ లేఖపై గరిష్టంగా ఆరుగురు భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తారు. ఇదివరకు సోమవారం జరిగే వీఐపీ బ్రేక్ దర్శనం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజాప్రతినిధుల నుంచి ఆదివారం సిఫార్సు లేఖలు స్వీకరించేవారు. అయితే ఇకపై ఆదివారం నాటి దర్శనం కోసం శనివారం నాడే ఆ లేఖలను స్వీకరించనున్నట్లు టీటీడీ తెలిపింది. తిరుమలలో అందుబాటులో ఉన్న వసతి సౌకర్యాలు, ఇతర సాధారణ భక్తుల దర్శన సమయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ పేర్కొంది. ఈ మార్పులకు భక్తులు సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *