తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరణ పరిణామం చోటు చేసుకుంది. అసెంబ్లీలోని బీఆర్ఎస్ఎల్పీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుతో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సమావేశః అయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలతో తీన్మార్ మల్లన్న బీసీ బిల్లుపై చర్చించారు. బీసీ బిల్లుకు కేంద్రం చట్టబద్దత కల్పించేలా ఢిల్లీ వేదికగా తాము చేయబోయే ధర్నాకు మద్దతు ఇవ్వాల్సిందిగా బీఆర్ఎస్ నేతలను తీన్మార్ మల్లన్న కోరారు. ప్రభుత్వం బీసీ బిల్లు తేవటం గొప్ప విషయం కాదన్నారు తీన్మార్ మల్లన్న. దాన్ని పార్లమెంటులో ఆమోదించేలా ఒత్తిడి తేవాలన్నారు. అవసరం అయితే కేంద్రంలో ఆమోదం కోసం జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయాలని సీఎంకు డిమాండ్ చేస్తున్నామని మల్లన్న తెలిపారు. జంతర్‌మంతర్ దగ్గర ప్రభుత్వం, సీఎం దీక్ష చేసేలా ఒత్తిడి తేవాలని కేటీఆర్ హరీశ్‌రావును మల్లన్న కోరారు. బీసీ రిజర్వేషన్ బిల్లుపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని అందుకు మీ సహకారం కావాలని కేటీఆర్‌కు మల్లన్న విజ్ఞప్తి చేశారు.
ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ, బీజేపీ శాసనసభా పక్ష నేత మహేశ్వర్‌రెడ్డిని కూడా కలిశామని తీన్మార్ మల్లన్న తెలిపారు. అన్నిపార్టీల నేతలు బీసీ బిల్లుకు మద్దతిస్తామన్నారని తెలిపారు. అన్ని పార్టీల మద్దతుతో బిల్లును ఆమోదించాలని సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు.