రాజాసింగ్ వ్యాఖ్యలతో రేవంత్ రెడ్డి దొరికిపోయారు… రహస్య సమావేశం సిగ్గుచేటు: కేటీఆర్

V. Sai Krishna Reddy
2 Min Read

తెలంగాణ బీజేపీ నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రహస్యంగా సమావేశం కావడం సిగ్గుపడాల్సిన విషయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో బీజేపీ కోవర్టులు ఉన్నారని రంకెలు వేసే రాహుల్ గాంధీకి, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలతో దొరికిపోయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకునే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు.

తెలంగాణ బీజేపీకి చెందిన కొందరు నాయకులు రేవంత్ రెడ్డితో రహస్యంగా భేటీ అవుతున్నారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ఆరోపణలు చేసినట్టు వచ్చిన పత్రికా కథనాన్ని తన ‘ఎక్స్’ వేదికగా పంచుకున్న కేటీఆర్ విమర్శలు గుప్పించారు.

“బీజేపీ నేతలతో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రహస్య సమావేశాలా.. సిగ్గు.. సిగ్గు..!” అని మండిపడ్డారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అధికారిక సమావేశాలు నిర్వహించాలి కానీ ఈ చీకటి సమావేశాలు పెట్టడమేమిటని ప్రశ్నించారు. ఇలాంటి దిక్కుమాలిన చిల్లర రాజకీయాలు తెలంగాణ నేలపై ఇంత వరకు ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నారు.

ఒకవైపు బయటకు బీజేపీ నేతలతో కుస్తీపడుతున్నట్లు పోజులు కొట్టి, దొంగచాటుగా దోస్తీ చేసే ఈ నీచ సంస్కృతికి తెరలేపడం అత్యంత దుర్మార్గమని అన్నారు. ఏ గూడుపుఠాణి చేయడానికి ఈ తెరచాటు సమావేశాలు నిర్వహిస్తున్నారో దమ్ముంటే ముఖ్యమంత్రి బయటపెట్టాలని కేటీఆర్ నిలదీశారు.

పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా, గురుకులాల్లో విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నా, ఒక్క సమీక్ష నిర్వహించే సమయం లేని ముఖ్యమంత్రికి, ఈ రహస్య సమావేశాలకు మాత్రం సమయం దొరకడం క్షమించలేని ద్రోహమని అన్నారు.

అట్టర్ ఫ్లాప్ ముఖ్యమంత్రిగా ముద్రపడి, ఇక ఏ క్షణంలోనైనా తన సీఎం కుర్చీ చేజారే సూచనలు కనిపించడం వల్లే ముఖ్యమంత్రి బీజేపీతో ఈ చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నట్లు స్పష్టమవుతోందని అన్నారు. ఏడాదిన్నరలో రాష్ట్రాన్ని ఆగంచేసి, డర్టీ పాలిటిక్స్ చేస్తున్న ఈ రాబందు రాజకీయాలను తెలంగాణ సమాజం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించదని పేర్కొన్నారు. రెండు ఢిల్లీ పార్టీలకు తెలంగాణ సమాజం కర్రు కాల్చి వాతపెడుతుందని ఆయన పేర్కొన్నారు

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *