తెలంగాణ ఉద్యమానికి నిరుద్యోగులు పునాదులుగా మారారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నిరుద్యోగ సమస్య అంశం తెలంగాణ ఉద్యమాన్ని ఎంతో ఎత్తుకు తీసుకువెళ్లిందని ఆయన అన్నారు. రాష్ట్ర సాధనలో నిరుద్యోగుల పాత్ర ఎంతో ఉందని గుర్తు చేసుకున్నారు. కానీ గత ప్రభుత్వానికి ఉద్యమం పట్ల బాధ్యత లేక నిరుద్యోగ సమస్యకు పరిష్కారం దొరకలేదని అన్నారు.
హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో, జూనియర్ లెక్చరర్, పాలిటెక్నిక్ లెక్చరర్ల ఉద్యోగాలకు ఎంపికైన 1,532 మందికి ముఖ్యమంత్రి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. కొత్తగా ఉద్యోగ బాధ్యతలు చేపడుతున్న వారికి ఆయన అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కొత్త అధ్యాపకులు రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడిపించాలని ముఖ్యమంత్రి అన్నారు.
గత ప్రభుత్వ పెద్దల ఉద్యోగాలు తీస్తేనే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని తాను గతంలోనే చెప్పానని, ఇప్పుడు అదే నిజమైందని ముఖ్యమంత్రి అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 50 వేలకు పైగా నియామకాలు చేపట్టిందని తెలిపారు. నియామకాలకు సంబంధించి కోర్టుల్లో ఉన్న చిక్కుముళ్లను విప్పుతూ సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు. గతంలో సంతలో సరకులా ప్రశ్నాపత్రాలను అమ్మారని ఆరోపించారు.
30 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 25 లక్షల మంది విద్యార్థులు ఉన్నారని, 11 వేల ప్రైవేటు పాఠశాలల్లో 36.7 లక్షల మంది విద్యార్థులు ఉన్నారని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు రూ. 25 వేల వరకు ఖర్చవుతోందని, ప్రభుత్వ పాఠశాలల్లో రూ. 1 లక్ష వరకు ఖర్చవుతోందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేటు పాఠశాలలు గొప్పవా అని ప్రశ్నించారు. విద్యార్థుల భవిష్యత్తును విద్యాశాఖ తీర్చిదిద్దాలని సూచించారు. బడ్జెట్‌లో విద్యాశాఖకు ప్రాధాన్యత ఇచ్చామని, అందుకే రూ.21,650 కోట్లు కేటాయించామని చెప్పారు.