తండ్రి ఉపాధ్యాయుడు కావడంతో నిమ్మకూరులో 24 ఏళ్ళు నివాసం
నిమ్మకూరులో ఎన్టీఆర్ ఇంట్లోనే రాజేంద్రప్రసాద్ జననం.
గొడ్లచావిడిలో జన్మించిన రాజేంద్రప్రసాద్.
రాజేంద్రప్రసాద్ తల్లి ప్రసవం వేళ ఎన్టీఆర్ మాతృమూర్తి వెంకట్రావమ్మ సాయం
తెలుగు చిత్రసీమలో తన ప్రత్యేకతను చాటుకున్న రాజేంద్రప్రసాద్, నందమూరి తారక రామారావు కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని వివరించారు. తాను ఎన్టీఆర్ స్వగ్రామమైన నిమ్మకూరులో జన్మించానని ఆయన గుర్తు చేసుకున్నారు.
రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, “నిమ్మకూరులో ఎన్టీ రామారావు గారి ఇల్లు… అది చిన్న మేడ, ఒక పెంకుటిల్లు కలిగిన ఇల్లు. మా నాన్నగారు స్కూల్ టీచర్ కావడంతో ఆ ఊరికి బదిలీ అయ్యారు. మేము ఆ పెంకుటింట్లో దాదాపు 24 సంవత్సరాలు ఉన్నాము. ఎన్టీ రామారావు గారి ఇంట్లో నాకున్న అనుబంధం విడదీయరానిది.
నేను మా అమ్మ కడుపులో ఉండగా, తెల్లవారుజామున మూడు గంటలకు గేదె అరుస్తుంటే, మా అమ్మ గడ్డి వేయడానికి వెళ్లింది. అప్పుడు పురిటి నొప్పులు రావడంతో అక్కడే పడిపోయింది. వెంకట్రావమ్మ గారు, అంటే రామారావు గారి తల్లి, ఆమె మహా తల్లి. ఆమె ముఖం కూడా రామారావు గారిలానే ఉండేది. ఆవిడ చేతుల మీదుగానే నేను జన్మించాను. ఆ విధంగా ఎన్టీ రామారావు గారి ఇంట్లో, గొడ్ల చావిడిలో నేను పుట్టడం జరిగింది” అని రాజేంద్రప్రసాద్ ఎన్టీఆర్ కుటుంబంతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు