మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన అమృత-ప్రణయ్ పరువు హత్య కేసులో అనేక కీలక విషయాలను అప్పటి నల్గొండ ఎస్పీ, ఐపీఎస్ అధికారి రంగనాథ్ (ప్రస్తుతం హైడ్రా కమిషనర్) వెల్లడించారు. ఈ కేసు దర్యాప్తులో ఎదురైన సవాళ్లు, మారుతీరావు ప్రవర్తన, కేసును ఛేదించిన విధానం గురించి ఆయన వివరించారు.
ఈ కేసులో అన్ని కోణాలు ఉన్నాయని, ఇది ఒక పరువు హత్య అని, కాంట్రాక్ట్ కిల్లర్లతో హత్య చేయించడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేరస్థులు చాలా తెలివిగా వ్యవహరించారని రంగనాథ్ తెలిపారు. కేసు మొదట్లో చాలా గందరగోళంగా ఉందని, మారుతీరావు కూడా తనకు ఏమీ తెలియదని చెప్పాడని ఆయన అన్నారు.
దర్యాప్తు ప్రారంభించిన మూడు రోజుల్లోనే కేసును ఛేదించామని, నిందితులపై కఠిన చర్యలు తీసుకున్నామని రంగనాథ్ తెలిపారు. ఈ కేసులో ఏ2 నిందితుడికి మరణశిక్ష, ఏ3తో పాటు మిగిలిన వారికి జీవిత ఖైదు పడటం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. నిజం ఎప్పుడూ నిజమేనని, ఎంత దాచినా అది బయటకు వస్తుందని ఆయన స్పష్టం చేశారు.
విజయవాడ ఆయేషా కేసును సీబీఐ విచారిస్తోందని, దానిపై తాను వ్యాఖ్యానించదలచుకోలేదని రంగనాథ్ అన్నారు. కేసు విచారణ సమయంలో పోలీసులు మేనేజ్ చేశారంటూ కొందరు నిరాధార ఆరోపణలు చేశారని, వాటిని పట్టించుకోకుండా నిజం నిలకడ మీద తెలుస్తుందనే నమ్మకంతో ముందుకు సాగామని ఆయన తెలిపారు.
డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏడు రోజుల పాటు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారని, డిఫెన్స్ లాయర్లు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో ముందే ఊహించి వాటికి సమాధానాలు సిద్ధం చేశామని రంగనాథ్ చెప్పారు. ఛార్జ్ షీట్ దాదాపు 1600 పేజీలు ఉందని, దానిని పదిసార్లు మార్చామని ఆయన అన్నారు.
మారుతీరావు తన కూతురిని అమితంగా ప్రేమించాడని, ఆ ప్రేమతోనే తప్పు చేశాడని రంగనాథ్ అన్నారు. మన పెంపకంలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే గనుక వేరే వాడిని దానికి బాధ్యుడిని చేయడం అనేది ఎంతవరకు సమంజసం అనేది కూడా మారుతీరావుతో తాను చర్చించినట్లు ఆయన తెలిపారు. ఈ కేసు తమకు ఒక లెర్నింగ్ లెసన్ అని, మానవ మనస్తత్వం, టీనేజ్ సైకాలజీ, కులాంతర వివాహాల్లోని సమస్యలను అర్థం చేసుకున్నామని ఆయన అన్నారు.
2019 జూన్‌లో ఛార్జ్ షీట్ దాఖలు చేశామని, విచారణ ఆలస్యమైందని కొందరు విమర్శించారని, అయితే పకడ్బందీగా దర్యాప్తు చేయాలనే ఉద్దేశంతోనే ఆలస్యమైందని రంగనాథ్ అన్నారు. మారుతీరావు తన అల్లుడిని తానే హత్య చేయించానని స్వయంగా ఒప్పుకున్నాడని ఆయన వెల్లడించారు.
హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్లినా ఈ కేసులో నిందితులకు శిక్ష తప్పదని రంగనాథ్ ధీమా వ్యక్తం చేశారు. దర్యాప్తు పక్కాగా చేసినందున ఎక్కడికి వెళ్లినా ఫలితం మారదని ఆయన అన్నారు.