మలయాళంలో ఈ ఏడాదిలో భారీ విజయాన్ని సాధించిన చిత్రాల జాబితాలో ‘రేఖా చిత్రం’ చేరిపోయింది. జోఫిన్ చాకో దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అసీఫ్ అలీ .. అనశ్వర రాజన్ ప్రధానమైన పాత్రలను పోషించగా, ప్రత్యేకమైన పాత్రలో మమ్ముట్టి కనిపిస్తారు. జనవరి 9వ తేదీన విడుదలైన ఈ సినిమా, భారీ వసూళ్లను నమోదు చేసింది. మలయాళంతో పాటు తెలుగు .. తమిళ .. కన్నడ .. హిందీ భాషల్లో నిన్నటి నుంచి ‘సోనీ లివ్’లో స్ట్రీమింగ్ అవుతోంది.
కథ: రాజేంద్రన్ (సిద్ధిఖీ) ఒక శ్రీమంతుడు. ఒక రోజున ఆయన ఒక ఫారెస్టు ఏరియాకి వెళతాడు. అక్కడ ఒక చెట్టుక్రింద కూర్చుంటాడు. 1985లో చేసిన ఒక పాపం తనని వెంటాడుతుందంటూ ఆవేదన చెందుతాడు. తాను .. తన స్నేహితులైన ఫ్రాన్సిస్ .. విన్సెంట్ కలిసి ఓ 18 ఏళ్ల అమ్మాయిని ఆ చెట్టు క్రిందనే పూడ్చి పెట్టామని చెబుతూ ఒక సెల్ఫీ వీడియోగా వదిలి, షూట్ చేసుకుని చనిపోతాడు.
అదే రోజున ఆ ఏరియా పోలీస్ స్టేషన్ లో వివేక్ గోపీనాథ్ (అసీఫ్ అలీ) ఛార్జ్ తీసుకుంటాడు. రాజేంద్రన్ చెప్పిన చోటున త్రవ్వించగా ఒక అస్థిపంజరం బయటపడుతుంది. కాలు పట్టీలు ఉండటం వలన అది ఒక అమ్మాయిది అనే నిర్ధారణకు వస్తారు. అమ్మాయి ఎవరో తెలుసు కోవడం కోసం వివేక్ రంగంలోకి దిగుతాడు. అలాగే రాజేంద్రన్ చెప్పిన ఫ్రాన్సిస్ .. విన్సెంట్ ఎవరు? వాళ్లు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? అనేది ఆరాతీయడం మొదలుపెడతాడు.
ఆ అమ్మాయి పేరు రేఖ ( అనశ్వర రాజన్) అని చంద్రప్పన్ అనే వ్యక్తి ద్వారా వివేక్ తెలుసుకుంటాడు. అయితే ఆ మరుసటి రోజే అతణ్ణి ఎవరో హత్య చేస్తారు. రాజేంద్రన్ గురించి వివేక్ కి చెప్పడానికి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులు కూడా హత్యకి గురవుతారు. రేఖ ఎవరు? ఆమె ఫ్యామిలీ నేపథ్యం ఏమిటి? ఆమెను ఎవరు చంపుతారు? ఫ్రాన్సిస్ – విన్సెంట్ ఎవరు? ఈ మర్డర్ మిస్టరీని వివేక్ ఎలా ఛేదిస్తాడు? అనేది కథ.
విశ్లేషణ: విలాసవంతమైన జీవితాన్ని కోరుకునేవారు, అందుకోసం ఏలాంటి నేరం చేయడానికైనా వెనుకాడరు. అయితే తెలిసో .. తెలియకో ఆ నేరంలో కొంతమంది పాలుపంచుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే కర్మ అనేది ఎక్కడ ఉన్నా వెంటాడుతూనే ఉంటుంది. ఫలితాన్ని ముట్టజెబుతూనే ఉంటుంది. ఆ విషయాన్ని మరోసారి స్పష్టం చేసిన సినిమానే ‘రేఖాచిత్రం’.
అటవీ ప్రాంతంలో జరిగిన ఒక ఆత్మహత్య .. గతంలో అక్కడ జరిగిన హత్యను బయటపెడుతుంది. చనిపోయింది ఎవరు? చంపింది ఎవరు? అనే ఇన్వెస్టిగేషన్ తో కథ వేగాన్ని పుంజుకుంటుంది. సాధారణంగా ఇలాంటి కథలలో హంతకులను పట్టుకోవడం కష్టంగా మారుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మాత్రం హత్య చేయబడినది ఎవరు? అనేది తెలుసుకోవడం మరింత కష్టతరమవుతుంది. ఇది ఈ కథలోని కొత్త యాంగిల్ గా చెప్పుకోవచ్చు.
మర్డర్ మిస్టరీని ఛేదించడానికి జరిగే ప్రయత్నాలతో పాటు, అందుకు సంబంధించిన లొకేషన్స్ కూడా ఉత్కంఠకు కారణమవుతూ ఉంటాయి. ఈ కథ విషయంలో లొకేషన్స్ హైలైట్ గా నిలిచాయని చెప్పాలి. రేఖ పాత్ర ఎంట్రీ ఇచ్చిన తరువాత కొంతసేపటివరకూ కథ కాస్త డల్ అయినట్టుగా అనిపించినా, ఆ తరువాత మళ్లీ నిదానంగా గాడిలో పడిపోతుంది. సహజత్వానికి దగ్గరగా అనిపించే ఈ సినిమాను, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు.