అదానీ, అంబానీలతో పోటీపడేలా మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మహిళలు రాణించాలంటే చదువుకోవాలని ఆయన పేర్కొన్నారు. కోఠిలోని చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో నూతన భవన నిర్మాణాలకు, చారిత్రక కట్టడాల పునరుద్ధరణ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఐలమ్మ యూనివర్సిటీ విద్యార్థినులు అంతర్జాతీయ స్థాయి విశ్వవిద్యాలయాలతో పోటీ పడాలని ఆకాంక్షించారు. మహిళలకు అవకాశం లభిస్తే వారు తమ సామర్థ్యాన్ని నిరూపించుకుంటారని ఆయన అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం అనేక పథకాలను అమలు చేస్తోందని, స్వయం సహాయక సంఘాల ద్వారా 100 ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసి ఆర్టీసీకి అందిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వానికి సోలార్ విద్యుత్ సరఫరా చేసే విధంగా మహిళా సంఘాలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన వెల్లడించారు.