రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి కొద్దికాలంగా సైలెంట్ అయిపోయారు. మొన్నటిదాకా ప్రభుత్వంలో అన్నీ తానే అన్నట్టు హాడావిడి చేసిన ఆయన.. ఇప్పుడు సడీసప్పుడు చేయడం లేదు. ఒక దశలో ప్రభుత్వంలో నం.2గా ప్రచారం చేసుకున్న ఆయన.. ఇప్పుడు కనిపించడమే కరువైంది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి కొద్దికాలంగా సైలెంట్ అయిపోయారు. మొన్నటిదాకా ప్రభుత్వంలో అన్నీ తానే అన్నట్టు హాడావిడి చేసిన ఆయన.. ఇప్పుడు సడీసప్పుడు చేయడం లేదు. ఒక దశలో ప్రభుత్వంలో నం.2గా ప్రచారం చేసుకున్న ఆయన.. ఇప్పుడు కనిపించడమే కరువైంది. చీటికిమాటికి విలేకరుల సమావేశాలు నిర్వహిస్తూ.. లక్ష్మీబాంబులు, అరెస్టులు అంటూ ప్రకటనలు చేస్తూ తెగ హంగామా చేసేవారు. సీఎం రేవంత్‌రెడ్డితో అత్యంత సన్నిహితంగా మెలిగేవారు. కానీ ఇప్పుడు సీఎంతో కలిసి కనిపించడమే గగనమైంది. పొంగులేటి మౌనం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. చాలాకాలం తరువాత ఆయన గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కనిపించారు. అయితే కాంగ్రెస్ పార్టీలో ఆయన ఒంటరయ్యారనే చర్చ జరుగుతున్నది. భూ ఆరోపణలు వచ్చినప్పటి నుంచి మౌనం
సొంత పార్టీ ఎమ్మెల్యేలే మంత్రి పొంగులేటిపై భూ ఆక్రమణ ఆరోపణలు చేశారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఓ భూమికి సంబంధించి మంత్రి పొంగులేటిపై పరోక్షంగా ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై అనిరుధ్‌రెడ్డి ఏకంగా ముఖ్యమంత్రికే ఫిర్యాదు చేసినట్టు సమాచారం. మరి కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా మంత్రి పొంగులేటిపై పలు ఆరోపణలు చేసినట్టు తెలిసింది. ఇదంతా అధిష్ఠానం ముందుకు కూడా వెళ్లింది. పొంగులేటిపై ఆరోపణల వెనక ఎవరి హస్తం ఉందనే చర్చ కూడా జోరుగా సాగింది. ఈ వ్యవహారంతో మంత్రి పొంగులేటి తీవ్రంగా ఇబ్బంది పడినట్టు తెలిసింది. ఇక అప్పటినుంచి ఆయన సైలెంట్‌గా ఉండాలని నిర్ణయించుకున్నట్టు సన్నిహితులు చెప్తున్నారు.
మంత్రిని దూరం పెట్టిన సీఎం
ప్రభుత్వం ఏర్పడింది మొదలు ఇటీవలివరకు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి మధ్య మంచి సమన్వయం ఉండేది. ఎక్కడ ఏ మీటింగ్ జరిగినా ఇద్దరూ హాజరయ్యేవారు. సీఎం పక్కనే పొంగులేటికి సీటు వేసేవారు. స్టేజీపై కూడా ఇద్దరు పిచ్చాపాటిగా ముచ్చటించుకునేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మంత్రి పొంగులేటిని ముఖ్యమంత్రి దూరం పెట్టినట్టు కాంగ్రెస్‌లో చర్చ జరుగుతున్నది. ఓవైపు భూ ఆరోపణలు, మరోవైపు నం.2గా ప్రచారం చేసుకోవడం, ఇంకోవైపు బీజేపీతో అంటకాగుతున్నారనే ఆరోపణలతో సీఎం ఆయనకు దూరంగా జరిగినట్టు తెలుస్తున్నది. ముందుజాగ్రత్త చర్యలో భాగంగానే ముఖ్యమంత్రి ఆయనను దూరం పెట్టినట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మంత్రి పొంగులేటి సీఎం సీటుపై కన్నేశారని, ఇందులో భాగంగానే బీజేపీతో అంటకాగుతున్నారనే ప్రచారం జరిగింది. ఆ క్రమంలోనే విదేశీ వాచీల వ్యవహారంలో ఐటీ దాడులు జరిగినా.. అది ముందుకు వెళ్లలేదు. దీంతో మంత్రి పొం గులేటి, కేంద్రం మధ్య సంబంధాలపై మరింత అనుమానం పెరిగినట్టు తెలిసింది. దీంతో మంత్రిని బలహీనపరచాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్‌రెడ్డే ఎమ్మెల్యేలతో భూ ఆరోపణలు చేయించినట్టు పార్టీలో చర్చ జరుగుతున్నది.
సర్వత్రా వ్యతిరేకత.. పడిపోయిన గ్రాఫ్!
అధికారంలో వచ్చిన తొలినాళ్లతో పోల్చితే మంత్రి పొంగులేటి పొలిటికల్ గ్రాఫ్ భారీగా పడిపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన చేసిన ప్రకటనలు అమలు కాకపోవడంతో పార్టీ, ప్రజల దృష్టిలో చులకనయ్యారు. బీఆర్‌ఎస్‌పై, కేటీఆర్ అరెస్ట్‌పై బాంబులు పేలుతాయంటూ ఆయన చేసిన ప్రకటనలు తుస్సుమన్నాయి. ఇందిరమ్మ ఇండ్ల విషయంలోనూ ఇదే జరిగింది. దీనికితోడు ఆయన తీరుపై ఇంటా బయట విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఆయన వ్యవహారశైలిపై సొంత శాఖ ఉద్యోగులతోపాటు సొంత జిల్లా, సొంత నియోజకవర్గ నేతలు కూడా తీవ్ర ఆసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది. ఆయనకు అత్యంత దగ్గరగా పనిచేసే వ్యక్తులు కూడా ‘మా సార్ గ్రాఫ్ పడిపోయింది’ అని వ్యాఖ్యానించడం గమనార్హం. సొంత శాఖకు చెందిన ఉన్నతాధికారులను కింది స్థాయి ఉద్యోగుల ముందే మందలించడంతో వారు ఆయనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. ఇక నియోజకవర్గ నేతలు తమకేమీ పనులు కావడం లేదని, మంత్రి తమను కలవడానికి ఇష్టపడటం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది.