కులగణనపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న లేవెనత్తిన అంశాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ డిమాండ్ చేశారు. కులగణనపై రాహుల్ గాంధీ చిత్తశుద్ధితో ఉన్నారని, ఆయన కీలక ఆదేశాలతోనే ఈ సర్వే జరిగిందని తెలిపారు. కానీ రాష్ట్రంలోని కొందరు నాయకులు కావాలనే ఈ సర్వేను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. అధిష్ఠానానికి తప్పుడు లెక్కలు అందించారని ఆయన అన్నారు.
పార్టీలో అందరూ సమానమేనని, హద్దు మీరితే ఎవరైనా సరే చర్యలు తీసుకోవడం సహజమేనని అన్నారు. పార్టీ గీత దాటితే చర్యలు తప్పవని, కానీ అధిష్ఠానం అందరినీ ఒకేలా చూడాలని సూచించారు. తీన్మార్ మల్లన్న హద్దులు దాటారని, అది ఆయన అహంకారానికి నిదర్శనమని మధుయాష్కీ అన్నారు. రేవంత్ రెడ్డి, మల్లన్న స్నేహితులని, వారిరువురు కలిసి డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు.