బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ: జ‌గ‌న్

V. Sai Krishna Reddy
1 Min Read

బాబు ష్యూరిటీ.. భ‌విష్య‌త్తుకు గ్యారెంటీ’ అని ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేసిన చంద్ర‌బాబు ఇప్పుడు మోసం త‌ప్ప ఏమీ చేయ‌డం లేద‌ని వైసీపీ అధినేత‌, మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ ధ్వ‌జ‌మెత్తారు. ఈరోజు తాడేపల్లిలోని తమ పార్టీ కార్యాల‌యంలో ఆయన మీడియా సమావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా వైఎస్ జ‌గ‌న్‌ మాట్లాడుతూ… అసెంబ్లీలో ప్రతిపక్షం మాటలు వినే పరిస్థితి లేద‌న్నారు. అందుకే మీడియా ముందుకు వచ్చామ‌ని తెలిపారు.

”చంద్రబాబు నేతృత్వంలోని కూట‌మి ప్రభుత్వం రెండు బడ్జెట్‌లు ప్రవేశపెట్టింది. ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌వేశ‌పెట్టిన‌ రెండు బడ్జెట్‌లలోనూ మోసం త‌ప్ప ఏమీ లేదు. దత్తపుత్రుడితో కలిసి మేనిఫెస్టో విడుదల చేశారు. మేనిఫోస్టో హామీలపై అడిగితే వారి నుంచి సమాధానం రావ‌డం లేదు. ఎన్నికలప్పుడు సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌ అంటూ ఊదరగొట్టారు. ప్రతి ఇంటికి బాండ్లు కూడా పంచారు. ఇప్ప‌టివ‌ర‌కు చంద్రబాబు ఇచ్చింది మాత్రం బోడి సున్నా” అని జ‌గ‌న్ ఆరోపించారు.

అలాగే 20 లక్షల ఉద్యోగాలు, రూ. 3 వేల నిరుద్యోగ భృతి అన్నారని, రెండు బడ్జెట్‌లలోనూ నిధులు కేటాయించలేదని విమర్శించారు. ఆత్మ‌స్తుతి-ప‌ర‌నింద అన్నట్లుగా కూట‌మి వార్షిక బడ్జెట్ ప్ర‌సంగం ఉంద‌న్నారు.

4 ల‌క్ష‌ల మందికి ఉపాధి క‌ల్పించామ‌ని గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంలో అబద్ధాలు చెప్పించారని మండిపడ్డారు. ఇక త‌మ ప్ర‌భుత్వం ఏర్పడిన నాలుగు నెల‌ల్లోనే 1.30 ల‌క్ష‌ల ఉద్యోగాలు ఇచ్చామ‌ని, 2.66 ల‌క్ష‌ల మంది వాలంటీర్ల‌ను నియ‌మించామ‌ని జ‌గ‌న్ తెలిపారు. అలాగే ఏపీసీఓఎస్ ద్వారా 96,000 మందికి ఉద్యోగాలు క‌ల్పించామ‌ని, ఆర్‌టీసీ విలీనం ద్వారా 58,000 మంది ఉద్యోగుల‌ను రెగ్యుల‌రైజ్ చేశామ‌న్నారు. వైసీపీ ఐదేళ్ల పాల‌న‌లో మొత్తం 6.31 ల‌క్ష‌ల మందికి ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా జాబ్స్ ఇచ్చామ‌ని మాజీ సీఎం వివ‌రించారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *