పక్కింటి కుర్రాడిలా కనిపిస్తూ, సాఫ్ట్ లవ్ స్టోరీలతో అందరినీ అలరించిన కథానాయకుడు నాని గత కొంత కాలం నుంచి మాస్ సినిమాల బాట పట్టాడు. ఈ కోవలోనే శ్యామ్ సింగరాయ్, దసరా, సరిపోదా శనివారం వంటి మాస్ కథాంశాలతో సినిమాలు చేసిన నాని మరోసారి రా అండ్ రస్టిక్ ఊర మాస్ కథాంశంతో ‘ప్యారడైజ్’ పేరుతో ఓ సినిమా చేస్తున్నాడు. ఆయనతో ‘దసరా’ చిత్రాన్ని తెరకెక్కించిన శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రానికి సంబంధించిన ‘రా స్టేట్‌మెంట్ గ్లింప్స్’ను సోమవారం విడుదల చేశారు.
మదర్స్ రా స్టేట్‌మెంట్స్, సన్ రెవల్యూషన్ పేరుతో విడుదలైన ఈ గ్లింప్స్‌ను గమనిస్తే ఓ పవర్‌ఫుల్ వాయిస్‌తో కథాంశాన్ని వివరిస్తూ చెబుతున్న గొంతు మనకు వినిపిస్తుంది. “చరిత్రలో అందరూ చిలుకలు, పావురాల గురించి రాశారు కానీ అదే జాతిలో పుట్టిన కాకుల గురించి రాయలేదు. ఇది కడుపు మండిన కాకుల కథ. జమానా.. జమానాల కెళ్లి నడిచే శవాల కథ… అమ్మ రొమ్ములో పాలు లేక రక్తం పోసి పెంచిన ఓ జాతి కథ. ఓ థగడ్ వచ్చి మొత్తం జాతిలో ఓ జోష్ తెచ్చిండు… కాకులు తల్వర్‌లు పట్టినయ్.. ఇది ఆ కాకులను ఒక్కటి చేసిన ఓ లం… కొడుకు కథ. నా కొడుకు నాయకుడైన కథ.. నీయమ్మ” అంటూ చెబుతున్న వాయిస్ ఎండ్ అవుతుంది.
ఈ చిత్రంలో నాని గెటప్, ఆయన పాత్ర కూడా ఎంతో వైవిధ్యంగా కనిపిస్తుంది. ఈ గ్లింప్స్ చూస్తున్నంత సేపు దర్శకుడు అందరినీ ‘ప్యారడైజ్’ సినిమాటిక్ ప్రపంచంలోకి తీసుకెళ్లినట్లుగా అనిపిస్తుంది. గ్లింప్స్‌ను చూస్తుంటే ఈ రా అండ్ రస్టిక్ సినిమాలో రక్తపాతం, హింస, సంభాషణల విషయంలో డోస్‌ను దర్శకుడు కాస్త పెంచినట్లు తెలుస్తోంది. సినిమా బడ్జెట్ కూడా నాని కెరీర్‌లో అత్యధిక వ్యయంతో నిర్మిస్తోన్న చిత్రమిదే అని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. 2026 మార్చి 26న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.