విజయవాడలో భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇటీవలె విజయవాడలో ఒక ఎకరం 27 కోట్లు పలికినట్లు తెలియగా.. తాజాగా మరో చోట ఏకంగా రూ.35 కోట్లు పలకడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. దీంతో ఈ విషయం తెలిసిన వారు.. విజయవాడ రియల్ ఎస్టేట్.. హైదరాబాద్‌తో పోటీ పడుతోందని పేర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ రాజధాని అమరావతి నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. తాజాగా అధికారంలోకి వచ్చిన టీడీపీ-జనసేన-బీజేపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం.. రాజధాని నిర్మాణ పనులను వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలోనే అమరావతిలో గతంలో తాత్కాలిక భవనాలు నిర్మించగా.. ఇప్పుడు శాశ్వత భవనాలు నిర్మించే పనిలో పడింది. ఇక మూడు రాజధానులు అంటూ గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం చెప్పడంతో అమరావతిలో రియల్ ఎస్టేట్ భూమ్ భారీగా పడిపోయింది. కానీ తాజాగా తిరిగి అమరావతి రాజధాని నిర్మిస్తామని నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తేల్చి చెప్పడంతో అమరావతి మాత్రమే కాకుండా విజయవాడలో కూడా భారీగా రియల్ ఎస్టేట్ రంగం బాగా పుంజుకుంది. ఈ నేపథ్యంలోనే అక్కడి ధరలు చుక్కలను అంటుతున్నట్లు స్థానికులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు పేర్కొంటున్నారు.