ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని ఇటీవల రాయచోటి పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే. చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం, సినీ పరిశ్రమలో వర్గ భేదాలు సృష్టించడం వంటి అనేక ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఏపీలో పోసానిపై దాదాపు 11 కేసుల వరకు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో, ఆయన అరెస్ట్ పై వైసీపీ మహిళా నేత లక్ష్మీపార్వతి స్పందించారు.
గతంలో నంది అవార్డుల విషయంలో పోసాని మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదని అన్నారు. ఇది అన్యాయం… అవార్డులన్నీ ఓ వర్గం వారికే ఇస్తున్నారు… ఈ అవార్డు నేను తీసుకోను అని పోసాని అనడంలో తప్పేమైనా ఉందా? అని ప్రశ్నించారు.
మన దేశంలో భారతరత్న వంటి అవార్డులను, పద్మ భూషణ్, పద్మశ్రీ అవార్డులు కూడా తిరస్కరించిన వాళ్లు ఉన్నారని వెల్లడించారు. ప్రముఖ గాయని ఎస్.జానకి కూడా గతంలో పద్మభూషణ్ అవార్డును తిరస్కరించారని లక్ష్మీపార్వతి గుర్తుచేశారు. అప్పటి ప్రభుత్వాల తీరు సరిగా లేదన్న కారణంతో అవార్డులు తిరస్కరిస్తున్నామని వారంతా చెప్పారని వివరించారు.
“పోసాని కృష్ణమురళి కూడా ఆ విధంగానే తనకు వచ్చిన అవార్డును తిరస్కరించారు. ఈ అవార్డు న్యాయబద్ధంగా రాలేదు… ఇందులో ఒకే వర్గానికి ప్రాధాన్యత కనిపిస్తోందని ఆయన విమర్శించారు. ఆయన ఎప్పుడో విమర్శిస్తే… ఆ విషయాన్ని ఇవాళ తీసుకువచ్చి ఆయనపై కేసు పెట్టారు. ఆయనకు డాక్టర్లు ఎన్ని ఆపరేషన్లు చేశారో మాకు తెలుసు. ఆయనకు నెల రోజుల పాటు గొంతు పోయింది.
అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తిని ఈ విధంగా వేధిస్తున్నారు. ఎక్కడో కేసు పెట్టారు. అది కూడా… మనోభావాలు దెబ్బతిన్నాయట. ఏమయ్యా… మీ వల్ల ఎంతమంది మనోభావాలు దెబ్బతిన్నాయో తెలియదా! మీ వల్ల ఎన్టీఆర్ మనోభావాలు దెబ్బతినలేదా, నా మనోభావాలు దెబ్బతినలేదా… రోజా, జగన్, భారతమ్మ… వీళ్లందరి మనోభావాలు దెబ్బతినలేదా?