హిందీలో స్త్రీ ప్రధానమైన పాత్రలతో .. కామెడీ టచ్ తో కూడిన పాత్రలతో వెబ్ సిరీస్ లు చేయడానికి ఎక్కువగా ఆసక్తిని చూపుతుంటారు. ఆ తరహాలో రూపొందిన మరో వెబ్ సిరీస్ ‘డబ్బా కార్టెల్’. షబానా ఆజ్మీ .. జ్యోతిక .. షాలినీ పాండే .. నిమిషా సజియన్ .. అంజలి ఆనంద్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్, 7 ఎపిసోడ్స్ గా ఈ రోజు నుంచే స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ కథేమిటనేది ఇప్పుడు చూద్దాం.
కథ: ఈ కథ ముంబై నేపథ్యంలో జరుగుతుంది. షీలా (షబానా ఆజ్మీ) కొడుకు హరి .. కోడలు రాజీ (షాలిని పాండే)తో కలిసి నివసిస్తూ ఉంటుంది. శంకర్ (జిషు సేన్ గుప్తా) ఓ ఫార్మా కంపెనీని రన్ చేస్తూ ఉంటాడు. ఆయన భార్య వరుణ (జ్యోతిక) ఒక బొటిక్ ను నిర్వహిస్తూ ఉంటుంది. అయితే ఆర్ధికంగా అది అంత సంతృప్తికరంగా లేకపోవడం ఆమెను నిరాశ పరుస్తూ అంటుంది. శంకర్ సంస్థలోనే హరి పనిచేస్తూ ఉంటాడు.
మాల (నిమిషా సజయన్) కొన్ని ఇళ్లలో పనిమనిషిగా చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తూ ఉంటుంది. ఆమెకి సంతోష్ అనే కుర్రాడితో ప్రేమ వ్యవహారం నడుస్తూ ఉంటుంది. రాజీ ఎంప్లాయిస్ కి ‘లంచ్ బాక్స్’ను రెడీ చేసి అందించే బిజినెస్ చేస్తూ ఉంటుంది. ఈ బిజినెస్ లో మాలతో పాటు, షాహిదా (అంజలి ఆనంద్) కూడా భాగమవుతుంది. సంతోష్ ఇచ్చిన గంజాయిని కూడా ఆ డబ్బాల ద్వారా మాల సేల్ చేస్తూ ఉంటుంది.
ఈ విషయం బయటికి రావడంతో గంజాయికి బదులుగా డ్రగ్స్ ను సప్లయ్ చేయడానికి షాహిదా .. రాజీ కూడా రంగంలోకి దిగుతారు. సంతోష్ ఇచ్చిన సరుకును డబ్బాల ద్వారా కస్టమర్స్ కి అందజేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే శంకర్ ఫార్మా కంపెనీ నుంచి బయటికి వస్తున్న ఇక డ్రగ్ ప్రమాదకరమైనదని భావించిన పాఠక్ అనే వ్యక్తి, ఆ విషయాన్ని బయటపెట్టడానికి ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఫార్మా డ్రగ్ ద్వారా శంకర్ ఫ్యామిలీ .. డ్రగ్స్ ద్వారా రాజీ ఫ్యామిలీ ఎలాంటి చిక్కులను ఎదుర్కోవలసి వచ్చిందనేది కథ.
విశ్లేషణ: చాలామంది తమకి ఎలాంటి ఉపాధి లేని సమయంలో, ఏదో ఒక ఒక ఆదాయం వచ్చే మార్గాన్ని ఎంచుకుంటారు. కొన్ని పనులు భవిష్యత్తులో ఎలాంటి చిక్కుల్లో పడేస్తాయనేది వారికి ఆ సమయంలో అర్థం కాదు. ఒకసారి ఒక తప్పు చేసినవాళ్లు, ఇక ఏ తప్పు చేయడానికైనా ఎప్పుడూ సిద్ధంగా ఉంటారనే ఉద్దేశంతోనే ఈ లోకం చూస్తుంది. అలాంటి ఒక అనుభవం ఎదురైన ఐదుగురు ఆడవాళ్ల కథ ఇది.
జీవితంలో ఆలుమగలు ఎంత అన్యోన్యంగా ఉన్నప్పటికీ, భర్త ఏం చేస్తున్నాడనేది భార్యకి తెలియాలి. భార్య చేసే వ్యాపారాలను గురించి భర్తకి తెలియాలి. ఒకరికి తెలియకుండా ఒకరు ప్రమాదకరమైన పనులు చేస్తే ఎలా ఉంటుందనే విషయాన్ని ఆవిష్కరించిన సిరీస్ ఇది. డబ్బు అవసరానికి సరిపడా ఉన్నంతవరకే అది ఆనందాన్ని ఇస్తుంది. అంతకు మించిన డబ్బు ఆందోళనకు కారణమవుతుందనే దిశగా ఆలోచింపజేస్తుంది.
అయిదు స్త్రీ ప్రధానమైన పాత్రలతో దర్శకుడు ఈ కథను నడిపించాడు. ఫ్యామిలీ ఆడియన్స్ అంతా చూసేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. అయితే దర్శకుడు ఇచ్చిన కామెడీ టచ్ సరిపోలేదు. అయిదు ప్రధాన పాత్రలను ఆసక్తికరంగా మలచడంలో .. వినోదభరితంగా కథను నడిపించడంలో దర్శకుడు పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదని అర్థమవుతుంది. ఇంట్రెస్టింగ్ ట్విస్టులు లేకుండా సాదాగా కథ సాగడం కాస్త అసహనాన్ని కలిగిస్తుంది.