రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేసే వరకు విశ్రమించవద్దని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన పీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పదవులు రాని వారు నిరుత్సాహపడవద్దని, కష్టపడిన వారికి తప్పకుండా పదవులు వస్తాయని హామీ ఇచ్చారు. నాలుగైదేళ్లు జిల్లా అధ్యక్షులుగా పనిచేసిన వారికి నామినేటెడ్ పదవులు ఇచ్చినట్లు చెప్పారు.
పార్టీ కోసం నమ్మకంగా పనిచేసిన వారికి కూడా ఉన్నత పదవులు ఇచ్చినట్లు చెప్పారు. పార్టీ కోసం కష్టపడిన వారికి సముచిత స్థానం కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం రెండేళ్ల కాలానికి కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చామని, మార్చి 10వ తేదీ లోపు జిల్లాల వారీగా ఇంఛార్జ్ మంత్రులు నామినేటెడ్ పదవులకు సంబంధించిన నివేదికలు ఇవ్వాలని ఆయన అన్నారు.
ప్రతిపక్షాలు చేసే విమర్శలను పట్టించుకోవద్దని ముఖ్యమంత్రి అన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే దేశం అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. కాంగ్రెస్‌కు ఎక్కువ, తక్కువ అనే తారతమ్యాలు లేవని ఆయన వెల్లడించారు. అనుభవజ్ఞులైన ఇద్దరిని ఇప్పటికే రాజ్యసభకు నామినేట్ చేశామని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని సూచించారు.