బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నితీశ్ కుమార్ శారీరకంగా అలసిపోయారని, మానసికంగా రిటైరయ్యారని అన్నారు. ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్ కుమార్ పార్టీ జేడీయూ ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదని నొక్కి చెప్పారు. ఏప్రిల్‌లో ర్యాలీ నిర్వహించేందుకు యోచిస్తున్నానని, అది ఇప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను తుడిచిపెట్టేస్తుందని పేర్కొన్నారు.
పార్టీలతో పొత్తు పెట్టుకుంటూ నితీశ్ కుమార్ తన సీఎం పీఠాన్ని నిలబెట్టుకుంటున్నారని ప్రశాంత్ కిషోర్ విమర్శించారు. పొత్తులు పెట్టుకోవడం వల్ల జేడీయూకు తక్కువ సీట్లు వచ్చినా పదవి ఉంటుందని నితీశ్ భావిస్తున్నారని పీకే ఎద్దేవా చేశారు. నితీశ్ కుమార్ వ్యూహానికి అడ్డుకట్ట వేయాలంటే వచ్చే ఎన్నికల్లో జేడీయూకు ఒక్క సీటు కూడా ఇవ్వకూడదని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నట్టు చెప్పారు. అప్పుడు మాత్రమే శారీరకంగా అలసిపోయిన, మానసికంగా రిటైరైన ముఖ్యమంత్రి దూరం అవుతారని పేర్కొన్నారు