శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో వైభవంగా జరుగుతున్న మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, శ్రీకాళహస్తి శాసన సభ్యుడు బొజ్జల సుధీర్ రెడ్డి కలిసి శ్రీకాళహస్తీశ్వర స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీకాళహస్తి చేరుకున్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి తొలుత దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, ఆలయ ఈవో బాపిరెడ్డి, దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు.
అనంతరం మంత్రి ఆనం స్థానిక శాసన సభ్యుడు బొజ్జల సుధీర్ రెడ్డితో కలిసి స్వామివారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించి, రాష్ట్ర ప్రజల క్షేమాభివృద్ధి కోసం స్వామివారిని ప్రార్థించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ, శ్రీకాళహస్తి ఆలయం దేశవ్యాప్తంగా శివ భక్తులకు ఆధ్యాత్మికంగా కీలక కేంద్రంగా వుందని, ప్రభుత్వం తరఫున మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.
మహా శివరాత్రి సందర్భంగా స్వామివారి దర్శనార్థం రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుందని తెలిపారు. భక్తుల మనోభావాలను కాపాడటానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ పెద్దపీట వేస్తుందని మంత్రి పేర్కొన్నారు.