మ్యాడ్’ సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘మ్యాడ్ స్క్వేర్’
ప్రధాన పాత్రల్లో నార్నె నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్
మార్చి 29న విడుదల కానున్న సినిమా
కళ్యాణ్ శంకర్ దర్శకత్వం.. భీమ్స్ సిసిరోలియో బాణీలు
2023లో వచ్చిన ‘మ్యాడ్’ మూవీకి సీక్వెల్‌గా వస్తున్న ‘మ్యాడ్ స్క్వేర్’ టీజర్ తాజాగా విడుదలైంది. జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. దీనికి కారణం ‘మ్యాడ్’ చిత్రం సూపర్ హిట్ కావడమే.
మార్చి 29న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. అందులో భాగంగా తాజాగా టీజర్‌ను రిలీజ్ చేశారు. ముగ్గురు హీరోలు మరోసారి తమ కామెడీతో కితకితలు పెట్టారు. మొత్తంగా టీజర్ కామెడీ, ఎంటర్టైన్మెంట్తో అదిరిపోయింది.
కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో బాణీలు అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.