ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తనకు ఇష్టమైన సూపర్ ఫుడ్ గురించి వివరించారు. సోమవారం బీహార్‌లోని భాగల్‌పుర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా తన ఆహారపు అలవాట్ల గురించి మోదీ వివరించారు. మఖానా (తామర విత్తనాలు) సూపర్ ఫుడ్ అని అన్నారు. అది ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకారి అని పేర్కొన్నారు.
తాను 365 రోజుల్లో 300 రోజులు మఖానాను అహారంలో భాగంగా చేసుకుంటానని చెప్పారు. దేశ వ్యాప్తంగా కూడా చాలా మంది ప్రజలు అల్పాహారంగా మఖానాను తీసుకుంటున్నారన్నారు. అందుకు అంతర్జాతీయ స్థాయిలో దాని ఉత్పత్తి ఉండాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
రైతుల శ్రేయస్సు కోసం బీహార్‌లో మఖానా బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు ఇటీవల బడ్జెట్ సందర్భంగా కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన విషయాన్ని ప్రధాని మోదీ గుర్తు చేశారు. మఖానా బోర్డు ప్రకటించినందుకు కృతజ్ఞతగా, సభలో ప్రధాని మోదీని మఖానాతో తయారు చేసిన దండతో సత్కరించారు.