ఐదు ఖాళీల్లో మూడు టీడీపీ నేతలే ఉన్నారు. వారు కూడా మళ్లీ చాన్స్ అడుగుతున్నారని ప్రచారం ఆశావహుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది
ఏపీలో త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలు కూటమి పార్టీల్లో ఆసక్తికరంగా మారాయి. ఐదు ఖాళీలు అవుతుండగా, ఆశావహులు భారీగా ఉండటం.. తమ పార్టీలకు కోటా ఇవ్వాలంటూ జనసేన, బీజేపీ ఒత్తిడి చేయడంతో టీడీపీ ఇరకాటంలో పడుతోందంటున్నారు. ఐదు ఖాళీల్లో మూడు టీడీపీ నేతలే ఉన్నారు. వారు కూడా మళ్లీ చాన్స్ అడుగుతున్నారని ప్రచారం ఆశావహుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. కూటమిలో నామినేటెడ్ పదవులు, ఎమ్మెల్సీ, రాజ్యసభ ఎంపీ స్థానాలను ఎలా పంచుకోవాలనే విషయమై గతంలోనే ఒక సర్దుబాటు చేసుకున్నారు. నామినేటెడ్ పదవుల్లో 60 శాతం టీడీపీకి, 30 శాతం జనసేన, 10 శాతం బీజేపీకి కేటాయించాలని కూటమి సమన్వయ కమిటీలో చర్చించారు. అదేవిధంగా ఎమ్మెల్సీ, రాజ్యసభ స్థానాలకు ఏర్పడే ఖాళీలను మూడు పార్టీలు సమంగా సర్దుకోవాలని గతంలోనే తీర్మానించుకున్నారు. అయితే ప్రస్తుతం ఐదు ఖాళీలు అవుతుండగా, ఏ పార్టీకి ఎన్ని కేటాయిస్తారనేది సస్పెన్స్ గా మారింది.
ఓట్లు సీట్లు ప్రకారం రాష్ట్రంలో టీడీపీ పెద్దపార్టీగా ఉంది. ఆ తర్వాత జనసేన, బీజేపీ ఉన్నాయి. అయితే రాజ్యసభ ఎన్నికల వరకు వచ్చేసరికి బీజేపీది పైచేయిగా కనిపిస్తోందంటున్నారు. గతంలో మూడు స్థానాలు ఖాళీ అయితే అందులో ఒకటి బీజేపీ తీసుకుంది. ఇంకొకటి జనసేనకు ఇవ్వాల్సివుండగా, రాజీనామా చేసి వచ్చిన నేతలను రీప్లేస్ చేయాల్సివుండటంతో జనసేన వదులుకుంది. ఇక రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఖాళీలు ఏర్పడితే ఒకటి జనసేనకు కేటాయించారు. మరొకటి టీడీపీ తీసుకుంది