ఇప్పుడు దాదాపు ప్రతి రంగాన్ని ఏఐ (కృత్రిమ మేధ) టెక్నాలజీ శాసించే పరిస్థితి నెలకొంది. ఏఐతో పనులు సులువుగా నెరవేరుతుండడంతో, ప్రభుత్వాలు సైతం ఈ దిశగా అడుగులు వేస్తున్నాయి. అయితే, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని ఆలోచనలు మరోలా ఉన్నాయి.
మీరు ప్రపంచంలోని ఏఐలు అన్నింటినీ తీసుకురండి… కానీ ఐదుగురు మనుషులు కలిసి పనిచేసిన దాంతో సమానం కాదు అని అన్నారు. ఏఐ కంటే మానవ మేధ గొప్పదని మీరే అంటారు అని వ్యాఖ్యానించారు.
బొత్తిగా తెలియని సాంకేతిక నైపుణ్యాల కోసం పాకులాడడం కంటే, ఏఐ ప్రతిఫలించలేని స్వీకరణ సామర్ధ్యాలను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ఏఐ ఎంతో యాంత్రికమైన వ్యవస్థ అని, ఇది మానవ శక్తిని పూర్తిగా భర్తీ చేయలేదని అభిప్రాయపడ్డారు.
టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా, మనిషికి మాత్రమే సాధ్యమైన అంశాలు కొన్ని ఉంటాయని… పరస్పర సహకారం, సృజనాత్మకత, సానుభూతి, నాయకత్వం వంటి విషయాల్లో మానవ శక్తిని ఏఐ అధిగమించలేదని నందన్ నీలేకని వివరించారు.
ఏఐ ఎంత యాంత్రికంగా మారుతుందో, మానవ గుణాలు అంత విలువైనవిగా మారతాయని పేర్కొన్నారు. ఏఐ ఎప్పుడూ సృష్టించలేదని, కేవలం అనుకరిస్తుందని నందన్ నీలేకని ఒక్క మాటలో తేల్చేశారు.