ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న విశాఖపట్నానికి చెందిన ప్రముఖ యూట్యూబర్ వాసుపల్లి నాని అలియాస్ ‘లోకల్ బాయ్’ నానిని సైబర్ క్రైం పోలీసులు అరెస్ట చేశారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సంపాదించవచ్చంటూ ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లను నాని తన యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఖాతాల్లో పోస్టు చేస్తున్నాడు. ఈ క్రమంలో నగరానికి చెందిన ఓ యువకుడు డఫాబెట్, ప్యారీమ్యాచ్, మహదేవ్‌బుక్, రాజాబెట్ వంటి ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లలో రూ. 2 కోట్ల వరకు పోగొట్టుకున్నాడు.
ఈ నేపథ్యంలో బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న నానిపై ఆ యువకుడు సైబర్ క్రైం పోలీసులు ఫిర్యాదు చేశాడు. మరోవైపు, తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా నానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వీడియోను తొలగించాలని ఆదేశించారు. ఈ విషయం కూడా పోలీసుల దృష్టికి రావడంతో శనివారం రాత్రి నానిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.