హైదరాబాద్ మహానగరంలో మెట్రోరైలును విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులోభాగంగానే మొదటి దశలో 69కిలోమీటర్ల మార్గంలో చేపట్టిన ప్రభుత్వం రెండో దశలో 161.4కిలోమీటర్ల మార్గంలో చేపట్టాలని నిర్ణయించింది. రెండో దశలో నాగోల్ నుంచి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ వరకు 36.8కిలోమీటర్ల మార్గంలో 24స్టేషన్లను గుర్తించింది. ఈ స్టేషన్ల వివరాలను హైదరాబాద్ మెట్రోరైలు సంస్థ ఎక్స్ ద్వారా శనివారం ప్రకటించింది.
230.4కిలోమీటర్లు
నగరానికి నలువైపుల మెట్రో రైలు మార్గం విస్తరించనుంది. మొదటి దశలో 69కిలోమీటర్ల మెట్రోరైలు ప్రాజెక్టు విజయవంతంగా నడుస్తున్న విషయం తెలిసిందే. రెండో దశలో ఎయిర్ పోర్ట్ వరకు విస్తరణే లక్ష్యంగా 76.4కిలోమీటర్ల మార్గంలో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. డీపీఆర్ లను కూడా కేంద్రానికి పంపించారు. ఇక ఫోర్త్ సిటీ 40కిలోమీటర్లు, నార్త్ సిటీ 45కిలోమీటర్ల మార్గంలో మెట్రోరైలును విస్తరించాలని నిర్ణయించారు. మొత్తం 230.4కిలోమీటర్ల మార్గంతో ఢిల్లీ తర్వాత హైదరాబాద్ మెట్రోరైలు రెండో స్థానంలో నిలవనుంది.
నాగోల్ నుంచి ఎయిర్ పోర్ట్ వరకు 24 స్టేషన్లు
నాగోల్ నుంచి ఎయిర్ పోర్టు వరకు మెట్రోరైలు మార్గంలో 24 స్టేషన్లను గుర్తించారు. వాటికి సంబంధించిన వివరాలను ఎక్స్ ద్వారా వెల్లడించారు. నాగోల్(ఎయిర్ పోర్టు), నాగోల్ ఎక్స్ రోడ్డు, అల్కాపురి, కామినేని హస్పిటల్, ఎల్బీనగర్(ఎయిర్ పోర్ట్), బైరమాల్ గుడ, మైత్రీనగర్, కర్మాన్ ఘాట్, చంపాపేట్, ఓవైసీ హస్పిటల్, డీఆర్డీఓ కంచాన్ బాగ్, బాలాపూర్ రోడ్డు, చాంద్రాయన్ గుట్ట, బండ్లగుడ రోడ్, మైలార్ దేవ్ పల్లి, కాటేదాన్, ఆరాంఘర్, న్యూ హైకోర్టు, గగన్ పహాడ్, శాతంరాయి, సిద్దాంతి, శంషాబాద్, కార్గో, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ ఉన్నాయి.
49.5కిలోమీటర్ల మార్గం
మొదటి దశ కారిడార్-1లోని ఎల్‌బీనగర్-మియాపూర్ మెట్రో మార్గంతో (29 కి.మీ) అనుసంధానం చేస్తూ మియాపూర్ నుంచి పటాన్‌చెరు వరకు 13.4 కి.మీ దూరం, ఎల్‌బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు 7.1 కి.మీ మేర నిర్మాణం చేపట్టనున్నారు.దీంతో ఈ కారిడార్ 49.5కిలోమీటర్లకు పెరగనుంది.
ఎంజీబీఎస్ నుంచి శామీర్ పేట్ 40.5కి.మీ
కారిడార్-2లో జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు 11 కి.మీ ఉన్న ఈ మెట్రో మార్గానికి సైతం రెండు వైపులా కొత్తగా అనుసంధానం చేస్తూ మెట్రో మార్గాలను విస్తరించనున్నారు. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కి.మీ, జేబీఎస్ నుంచి శామీర్‌పేట వరకు 22 కి.మీ మేర మొత్తం 40.5కి.మీ కానుంది.