హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జనవరి 3 నుంచి ఫిబ్రవరి 17 వరకు నుమాయిష్ జరిగిన విషయం తెలిసిందే. ఈ నెల 17తో ఈ ఎగ్జిబిషన్ పూర్తయింది. ఈ ఎగ్జిబిషన్ లో విపరీతమైన రద్దీ కొనసాగగా.. ఈ రద్దీలో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన మొత్తం 247 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆకతాయిలపై మఫ్టీలో నిఘా పెట్టిన షీ టీమ్స్ సిబ్బంది రహస్యంగా వేధింపుల ఘటనలను రికార్డు చేశారు. మహిళలను అసభ్యంగా తాకుతూ వేధించిన వారిని ఎప్పటికప్పుడు అరెస్టు చేశారు.
ఇందులో 37 కేసుల్లో చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు వుమెన్ సేఫ్టీ డీసీపీ తెలిపారు. ఇద్దరు నిందితులకు 2 రోజుల జైలు, 33 మందికి రూ.1050 చొప్పున ఫైన్ విధించినట్లు చెప్పారు. మరో 190 మందిని హెచ్చరించి వదిలిపెట్టామన్నారు. మిగతా 20 కేసులపై ప్రస్తుతం విచారణ జరుగుతోందని తెలిపారు. కాగా, మహిళలను వేధిస్తూ పట్టుబడ్డ 247 మందిలో 223 మంది పెద్దలు, 24 మంది మైనర్లు ఉన్నారని పోలీసు శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.