ఛాంపియన్స్ ట్రోఫీ ఓపెనింగ్ మ్యాచ్ లోనే పాక్ ఘోర ఓటమి
న్యూజిలాండ్ చేతిలో 60 రన్స్ తేడాతో ఓడిన ఆతిథ్య జట్టు
టాప్ ఆర్డర్ వైఫల్యమే తమ పరాజయానికి కారణమన్న రిజ్వాన్
కివీస్ తమకు ఇంత భారీ లక్ష్యాన్ని నిర్దేశిస్తుందని ఊహించలేదని వ్యాఖ్య
బుధవారం కరాచీ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభ మ్యాచ్ లో న్యూజిలాండ్ తో ఆతిథ్య పాకిస్థాన్ తలపడింది. అయితే, ఓపెనింగ్ మ్యాచ్ లోనే పాక్ కు ఘోర పరాభవం ఎదురైంది. ఏకంగా 60 పరుగుల తేడాతో కివీస్ చేతిలో ఆతిథ్య జట్టు పరాజయం పాలైంది. న్యూజిలాండ్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో సూపర్ విక్టరీని నమోదు చేసింది.
మొదట బ్యాటింగ్ లో 320 పరుగుల భారీ స్కోరు చేసిన కివీస్.. ఆ తర్వాత బౌలింగ్ లోనూ అదరగొట్టి ప్రత్యర్థి జట్టును 260 పరుగులకే కట్టడి చేసింది. ఇక ఊహించని రీతిలో తమ జట్టు ఓడిపోవడంతో పాక్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
మ్యాచ్ అనంతరం పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు. తమ టాప్ ఆర్డర్ బ్యాటర్లు ఘోరంగా విఫలం కావడం తమను దెబ్బకొట్టిందన్నాడు. అలాగే కివీస్ తమకు ఇంత భారీ లక్ష్యాన్ని నిర్దేశిస్తుందని ఊహించలేదని తెలిపాడు.
ప్రత్యర్థి జట్టు బ్యాటర్లను కట్టడి చేసేందుకు తాము తీవ్రంగా ప్రయత్నించినా, వారు అంతే అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో మా బౌలర్లు తేలిపోయారని పేర్కొన్నాడు. మొదట పిచ్ బౌలింగ్ కు అనుకూలించినా… ఆ తర్వాత బ్యాటింగ్ కి స్వర్గధామంగా మారిందన్నాడు. దాంతో కివీస్ బ్యాటర్లు అద్భుతంగా ఆడి రెండు సెంచరీలు చేశారని తెలిపాడు.
ఇక ఆట తొలి ఓవర్లోనే స్టార్ ప్లేయర్ ఫఖార్ జమాన్ ఫీల్డింగ్ చేస్తూ గాయపడటంతో పాకిస్థాన్ తమ టాప్ ఆర్డర్‌లో మార్పులు చేయాల్సి వచ్చింది. ఇక ఫఖార్ గాయంపై స్పష్టత రాలేదని, మెడికల్ రిపోర్ట్స్ వచ్చాక అసలు విషయం తెలుస్తుందన్నాడు. ప్రస్తుతం అతడు నొప్పితో బాధపడుతున్నాడని రిజ్వాన్ చెప్పుకొచ్చాడు.