ఢిల్లీ కొత్త సీఎం ఎవరన్న ఉత్కంఠకు బీజేపీ హైకమాండ్ తెరదించింది. ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా పేరును ఖరారు చేశారు. రేఖా గుప్తా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో షాలిమార్ బాగ్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. రేఖా గుప్తా గతంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. ఆమె ప్రఖ్యాత ఢిల్లీ యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేశారు.
కాగా, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ను ఓడించిన పర్వేశ్ వర్మ సీఎం రేసులో ముందున్నారంటూ వార్తలు వినిపించాయి. అయితే, అనూహ్య రీతిలో బీజేపీ అధిష్ఠానం రేఖా గుప్తాను సీఎంగా ఎంపిక చేసింది. ఈ సాయంత్రం ఢిల్లీ బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఇక, కేజ్రీవాల్ ను మట్టికరిపించడంద్వారా పెను సంచలనం సృష్టించిన పర్వేశ్ వర్మను డిప్యూటీ సీఎం పదవి వరించింది. స్పీకర్ గా విజయేంద్ర గుప్తాను ఎంపిక చేశారు. రేపు సీఎంతో పాటు ఆరుగురు క్యాబినెట్ మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేసే అవకాశాలున్నాయి.
27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. దాంతో రేపటి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. రేపు మధ్యాహ్నం 12.35 గంటలకు ప్రమాణ స్వీకారోత్సవం ఉంటుందని తెలుస్తోంది.