దామెర, ఫిబ్రవరి 18 (ప్రజాజ్యోతి):
తన కొడుకు పై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఓ తల్లి వేడుకుంది. బాధితురాలు దామెర మండలం ఊరుగొండ గ్రామానికి చెందిన ఒడుదోలు కవిత తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి అందాద 8 గంటల సమయంలో ఖిలా వరంగల్ కు చెందిన నూనె రాకేష్, చింటు (దిలీప్) వీరిద్దరూ ఇంటికి వచ్చి తన కుమారుడైన ఒడుదోలు పవన్ ను మాట్లాడే విషయం ఉందంటూ.. బైక్ పై ఎక్కించుకొని తీసుకెళ్లినట్టు బాధితురాలు తెలిపింది. ఎంత సమయం గడిచినా తన కుమారుడు ఇంటికి తిరిగి రాకపోవటంతో అనుమానం వచ్చి పవన్ కు ఫోన్ చేసింది. అప్పుడు అతని ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. తెలిసిన వారిని అందరిని అడిగి చూసింది. ఎవ్వరి నుండి సమాచారం రాలేదు. పవన్ ను తీవ్రంగా గాయ పరిచి రాత్రి అందాద రాత్రి 12 గంటల ప్రాంతంలో ఊరుగొండ గ్రామంలోని జంక్షన్ లో వదిలి వెళ్ళి నట్టు తెలిపింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు గాయాలైన పవన్ ను వెంటనే హనుమకొండ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నట్టు ఆమె పేర్కొంది. తన కుమారునిపై దాడికి పాల్పడి గాయ పరిచిన వారిని కఠినంగా శిక్షించాలని ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. తన కుమారునికి సదరు వ్యక్తుల నుండి ప్రాణ హాని ఉందని పేర్కొంది.