మరో రెండు రోజుల్లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈసారి హైబ్రిడ్ మోడ్ లో పాకిస్థాన్, దుబాయ్ వేదికలలో టోర్నమెంట్ జరగనుంది. ఈ మెగా ఈవెంట్ కోసం ఇప్పటికే రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు దుబాయ్ చేరుకుంది. ఆదివారం నుంచి ప్రాక్టీస్ మొదలుపెట్టింది. అయితే, ఈ ప్రాక్టీస్ సందర్భంగా స్టార్ ప్లేయర్, వికెట్ కీపర్ రిషభ్ పంత్ గాయపడ్డాడు.
అతని ఎడమ మోకాలిపై బంతి బలంగా తగలడంతో మైదానంలోనే కుప్పకూలాడు. నొప్పితో విలవిల్లాడిన అతడిని వైద్య సిబ్బంది గ్రౌండ్ నుంచి బయటకు తీసుకెళ్లినట్లు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ తన కథనంలో పేర్కొంది. హార్దిక్ పాండ్యా ఆడిన ఓ బలమైన షాట్ ఇలా పంత్ మోకాలికి తగిలినట్లు తెలిపింది.
కాగా, 2022 డిసెంబర్ లో పంత్ కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఆ సమయంలో అతని అదే మోకాలికి తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పుడు మళ్లీ దానిపైనే బంతి బలంగా తగలడంతో టీమిండియా శిబిరంలో ఆందోళన నెలకొంది. అయితే, కొద్దిసేపటి తర్వాత డ్రెస్సింగ్ రూమ్ నుంచి తిరిగి మైదానంలోకి అడుగు పెట్టిన పంత్.. అక్షర్ పటేల్‌తో కలిసి నవ్వుతూ కనిపించాడు. ఆ తర్వాత యథావిధిగా పంత్ నెట్స్‌లోకి అడుగు పెట్టడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.