న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో గత సాయంత్రం జరిగిన తొక్కిసలాటలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. మృతుల్లో 10 మంది మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. కుంభమేళా ముగింపు దశకు చేరుకుంటుండటంతో సందర్శించేందుకు భక్తులు పోటెత్తడంతో ఈ దుర్ఘటన జరిగింది.
ప్రయాగ్‌రాజ్ వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు 14వ నంబర్ ప్లాట్‌ఫాంపై ఉండటంతో కుంభమేళాకు వెళ్లే భక్తులు అక్కడకు చేరుకున్నారు. అయితే, కుంభమేళాకే వెళ్లే స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆలస్యం కావడంతో వాటి కోసం వచ్చిన ప్రయాణికులు కూడా అదే సమయంలో 12, 13, 14 నంబర్ ప్లాట్‌ఫ్లాంపై ఉండటంతో ఒక్కసారిగా రద్దీ పెరిగి తొక్కిసలాట చోటుచేసుకుంది.
తొక్కిసలాట ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తొక్కిసలాటలో పలువురు మృతి చెందినట్టు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ధ్రువీకరించారు. రద్దీని అంచనా వేశామని, అయితే అంతా క్షణాల్లో జరిగిపోయింది రైల్వే పేర్కొంది. ఈ ఘటనపై అత్యున్నతస్థాయి విచారణకు ఆదేశించినట్టు తెలిపింది