బడ్జెట్ కసరత్తులో భాగంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నిశాఖల నుంచి ప్రతిపాదనలు కోరుతున్నారు. అయితే ఎవరు ఏ ప్రతిపాదన సమర్పించినా, అంతిమంగా ముఖ్యమంత్రి నిర్ణయమే ఫైనల్ అంటున్నారు.
ఏపీలో చంద్రబాబు ప్రభుత్వానికి బడ్జెట్ ప్రవేశపెట్టడమే పెద్ద సవాలుగా మారిందనే టాక్ వినిపిస్తోంది. ఖర్చులు ఎక్కువ, ఆదాయం తక్కువగా ఉండటంతో బడ్జెట్ లెక్కలు తయారు చేయడం భారంగా మారుతోందని అంటున్నారు. నిధుల లభ్యతగా పరిమితంగా ఉండటంతో ఖర్చులకు కోతపెట్టేలా నిర్ణయాలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వార్షిక బడ్జెట్ తయారీపై ఆర్థిక మంత్రి కేశవ్ కసరత్తు చేస్తున్నారు. శాఖలవారీగా నివేదికలు తెప్పించుకుంటున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆయా శాఖలు ఏ పథకాలు అమలు చేయాలి? ఎంతమేర నిధులు అవసరమవుతాయనే విషయంపై సమాచారం తెప్పించుకుంటున్నారు. అయితే ప్రభుత్వం నుంచి భారీగా సాయం ఆశిస్తున్న మంత్రులు.. ఆర్థిక మంత్రి అంచనాకు మించి నిధులు అడుగుతున్నారని చెబుతున్నారు. దీంతో ఈ నెల 28న ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారుతోంది.
బడ్జెట్ కసరత్తులో భాగంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నిశాఖల నుంచి ప్రతిపాదనలు కోరుతున్నారు. అయితే ఎవరు ఏ ప్రతిపాదన సమర్పించినా, అంతిమంగా ముఖ్యమంత్రి నిర్ణయమే ఫైనల్ అంటున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవడంతో నిధుల సేకరణే కత్తిమీద సాములా మారిందంటున్నారు. ముఖ్యంగా ఖర్చులు పెరిగిపోవడం, ఆ మేరకు ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో చాలా మంత్రిత్వ శాఖల్లో దైనందిన కార్యకలపాలకు కూడా మీనమేషాలు లెక్కించాల్సిన పరిస్థితులు ఉన్నాయంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఏడాది ఏమైనా ఉపశమనం కల్పిస్తారా? లేదా? అన్నది ఉత్కంఠ రేపుతోంది