లోక్ సభలో ప్రధాని మోదీ స్పీచ్

V. Sai Krishna Reddy
3 Min Read

గతంలో ఢిల్లీ నుంచి రూపాయి పంపితే గ్రామాలకు 16 పైసలు చేరేవి: ప్రధాని మోదీరా     రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ

లోక్ సభలో ప్రధాని మోదీ స్పీచ్

రాష్ట్రపతి ప్రసంగం తమలో ఆత్మవిశ్వాసం నింపిందని వెల్లడి

గత ప్రభుత్వాలపై విమర్శనాస్త్రాలు

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్ సభలో చర్చ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారు. నా ప్రభుత్వాన్ని మూడోసారి కూడా ఎన్నుకున్నందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానంటూ మోదీ తన ప్రసంగం ప్రారంభించారు. రాష్ట్రపతి ప్రసంగం తమలో ఆత్మవిశ్వాసం నింపిందని అన్నారు. పేదరిక నిర్మూలనే తమ ప్రధాన ధ్యేయమనిచెప్పారు. వికసిత్ భారత్ సాధనే ఎన్డీయే ప్రభుత్వ లక్ష్యమని, ఈ క్రమంలో మధ్య తరగతి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాల్సి ఉందని మోదీ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా గత యూపీఏ పాలనపై విమర్శనాస్త్రాలు సంధించారు.

గత ప్రభుత్వాలు గరీబీ హఠావో అంటూ నినాదాలు మాత్రమే ఇచ్చాయి. మేం గత పదేళ్ల కాలంలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటికి తీసుకువచ్చాం. కొందరు నేతలు బంగ్లాలు కట్టుకోవడంపై దృష్టి సారించారు. మేం ప్రతి ఇంటికీ మంచి నీరు అందించడంపై దృష్టి సారించాం. దేశంలో పేదల కోసం 12 కోట్లకు పైగా మరుగుదొడ్లు కట్టించాం.

కొందరు నేతలు కేవలం పేదలతో ఫొటోలు దిగేందుకే ఉత్సాహం చూపిస్తుంటారు… పార్లమెంటులో పేదల గురించి మాట్లాడుతుంటే అదే నేతలు విసుగ్గా ముఖం పెడతారు. అప్పట్లో ఢిల్లీ నుంచి రూపాయి పంపితే గ్రామాలకు 16 పైసలే చేరుతున్నాయని ఓ ప్రధాని వాపోయారు. గతంలో ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఒకే ప్రభుత్వం ఉన్నప్పటికీ అదే పరిస్థితి!

కానీ ఇప్పుడు ఢిల్లీ నుంచి రూపాయి పంపితే గ్రామానికి రూపాయి చేరుతోంది. నగదు బదిలీ (డీబీటీ) ద్వారా నేరుగా ప్రజలకే సొమ్ము చేరుతోంది. ప్రజల సొమ్ము ప్రజల చేతికే అనేది మా నినాదం. డిజిటల్ టెక్నాలజీ ద్వారా పారదర్శకత పెంచాం. 10 కోట్ల నకిలీ బ్యాంకు ఖాతాలను గుర్తించి తొలగించాం. చమురులో ఇథనాల్ బ్లెండింగ్ ద్వారా విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేశాం.

గతంలో లక్షల కోట్ల అవినీతి అంటూ రోజూ వార్తలు వచ్చేవి. గత పదేళ్లుగా కేంద్ర ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు లేవు. కొందరు శీష్ మహల్ నిర్మాణం కోసం అవినీతికి పాల్పడతారు. ఎన్డీయే ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనపై భారీగా వెచ్చించింది. కేంద్రంలో పదేళ్లుగా అవినీతి లేకపోవడం వల్ల ప్రజలు లాభపడ్డారు. ఆయుష్మాన్ భారత్, జన ఔషధి కేంద్రాల ఏర్పాటు వల్ల రోగులకు ఎంతో మేలు జరిగింది. ప్రజలకు రూ.12 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు ఇచ్చాం.

మేం అధికారంలోకి రాకముందు ఎల్ఈడీ బల్బు ధర రూ.400 ఉండేది… మేం వచ్చాక ఎల్ఈడీ బల్బును రూ.40కే పంపిణీ చేశాం. ఎల్ఈడీ బల్బులును ప్రభుత్వం పంపిణీ చేయడం ద్వారా ప్రజలకు రూ.20 వేల కోట్లు ఆదా అయ్యాయి. గతంలో న్యూస్ పేపర్ల చూస్తే అవినీతి వార్తలు ఉండేవి… మా హయంలో ప్రతి రూపాయిని ప్రజల కోసమే ఖర్చు చేస్తున్నాం. ప్రజల డబ్బును మేం అద్దాల మేడలు నిర్మించడానికి ఉపయోగించడంలేదు. ప్రజల డబ్బును దేశాభివృద్ధికి వినియోగిస్తున్నాం. వరల్డ్ గేమింగ్ క్యాపిటల్ గా భారత్ రూపుదిద్దుకుంటోంది.

మా పాలన బాగుండడం వల్లే మళ్లీ మళ్లీ గెలుస్తున్నాం. హర్యానాలో మూడోసారి అధికారంలోకి వచ్చాం… మహారాష్ట్రలోనూ అధికారం నిలబెట్టుకున్నాం” అని మోదీ వివరించారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *