అక్రమ వలసదారుల అంశంపై సుప్రీంకోర్టు సీరియస్
అసోం ప్రభుత్వంపై సుప్రీంకోర్టు అసహనం
అక్రమ వలసదారులను ఎన్నాళ్లు పోషిస్తారని ప్రశ్న
వారిని పంపేందుకు ముహూర్తం కోసం చూస్తున్నారా? అంటూ వ్యాఖ్యలు
అక్రమ వలసదారుల అంశంలో అసోం ప్రభుత్వంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. 63 మంది విదేశీయులను నిరవధికంగా నిర్బంధ కేంద్రాల్లో ఉంచడం పట్ల అసంతృప్తి వెలిబుచ్చింది. అక్రమ వలసదారులను రెండు వారాల్లోగా వారి స్వదేశాలకు పంపాలని అసోం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇలా రోజుల తరబడి అక్రమ వలసదారులను పోషించలేం కదా అని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది.
అక్రమ వలసదారులను ఎప్పుడు పంపిస్తారు? అందుకేమైనా మంచి ముహూర్తం కోసం చూస్తున్నారా? అని ప్రశ్నించింది. ఇప్పటివరకు ఎంతమందిని స్వదేశాలకు పంపించారో నివేదిక ఇవ్వాలని కోరింది.
కాగా, అక్రమ వలసదారుల చిరునామాలు తెలియవని అసోం ప్రభుత్వం అఫిడవిట్ లో పేర్కొనడంపై సుప్రీంకోర్టు స్పందించింది. వారిని వారి సొంత దేశాల రాజధాని నగరాలకు పంపించేయాలని స్పష్టం చేసింది.