రేవంత్ రెడ్డి, కేటీఆర్‌కు లైడిటెక్టర్ పరీక్షలు చేస్తే బండారం బయటపడుతుంది: ధర్మపురి అర్వింద్
తెలంగాణలో హామీలు, మోసాలపై ప్రజలకు వివరిస్తామన్న అర్వింద్
ఢిల్లీలో కేజ్రీవాల్ భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపణ
తెలంగాణ నేతలను ఢిల్లీకి తీసుకువచ్చి అక్రమాలు చేశారని ఆరోపణ
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఇద్దరికీ లైడిటెక్టర్ పరీక్షలు చేస్తే వారి బండారం బయటపడుతుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ఈరోజు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ… వారిద్దరికీ లైడిటెక్టర్ పరీక్షలు చేయాలని డిమాండ్ చేశారు. ఓటుకు నోటు కేసు సమయంలో నోట్ల కట్టలు తీసుకువెళ్లమని రేవంత్ రెడ్డికి, ఈ-రేసింగ్ కేసులో ఫెమా నిబంధనలు ఉల్లంఘించాలని కేటీఆర్‌కు ఎవరు చెప్పారో తెలియాలన్నారు.
తెలంగాణలో హామీలు, మోసాలపై ప్రజలకు తాము వివరిస్తామన్నారు. ఢిల్లీలో కేజ్రీవాల్ కూడా భారీ అవినీతికి పాల్పడ్డారని అర్వింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ నేతలను ఢిల్లీకి తీసుకువచ్చి మరీ అక్రమాలు చేశారన్నారు.
కాగా, నిన్న ఈడీ విచారణ అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ… తాను లైడిటెక్టర్ పరీక్షలకు సిద్ధమని, రేవంత్ రెడ్డి కూడా సిద్ధమా? అని సవాల్ చేశారు. ఈ వ్యాఖ్యలపై ధర్మపురి అర్వింద్ స్పందించారు.